రాజమౌళి ఇంటికి అమిత్‌షా
కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తెలంగాణా పర్యటనకు బుధవారం అర్థరాత్రి హైదరాబాద్ రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా దర్శక ధీరుడు రాజమౌళి నివాసానికి వెళ్లనున్నారు. గతంలో హైదరాబాద్ వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌ను అమిత్‌షా కలిసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన ఏకంగా రాజమౌళి ఇంటికే వెళ్లనున్నారు. అరగంట సమయాన్ని గడపబోతున్నారు. ఈ భేటీ ఖమ్మం సభకు బయలుదేరే ముందే ఉదయమే ఉంటుందని సమాచారం. రాజమౌళితో పాటు మరో ఇద్దరు సెలబ్రెటీలను కూడా అమిత్‌షా కలవబోతున్నట్లు సమాచారం. రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు ప్రముఖులను కలవడం ఈ మధ్య కాలంలో పరిపాటయ్యింది. ఈ కార్యక్రమాన్ని ‘సంపర్క్ సే సమర్థన్’ అనే కార్యక్రమంగా పేర్కొంటున్నారు. గతంలో రామ్‌చరణ్ కూడా ఢిల్లీలో అమిత్‌షాను కలిసారు. ఇది కేవలం ‘ట్రిపుల్ ఆర్’ సినిమాకు ఆస్కార్ వచ్చినందుకు అభినందన మాత్రమేనా ?ఇంకేదైనా ఉందా? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ రాజ్యసభ సభ్యుడుగా ఉన్నారు. దీనితో ఏదైనా రాజకీయ కోణాలు ఉంటాయని అనుకుంటున్నారు.

