విజయ సంకల్ప సభకు-ముఖ్య అతిథిగా అమిత్‌షా
నల్గొండ: నల్గొండ జిల్లా కేంద్రంలో బీజేపీ శనివారం (నేడు) నిర్వహిస్తున్న సకల జనుల విజయ సంకల్ప సభకు సర్వం సిద్ధం చేశారు. ఈ సభకు ముఖ్య అతిథిగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఈ రోజు రావడంతో పార్టీ నాయకులు, శ్రేణులు దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. నల్గొండ జిల్లాలోని ఆరు నియోజకవర్గాలతో పాటు హుజూర్‌నగర్, సూర్యాపేట నుంచి సైతం భారీ జనసమీకరణకు నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. గద్వాల నుండి హెలికాప్టర్‌లో నేటి మధ్యాహ్నం 2.45 గంటలకు జిల్లా పోలీసు శిక్షణా కేంద్రం (డీటీసీ)లోని హెలిప్యాడ్‌కు చేరుకుని 2.55 గంటలకు పట్టణంలో సభ ఏర్పాటు చేసిన మేకల అభినవ్ ఇండోర్ స్టేడియానికి చేరుకుంటారు. మ.3.30 వరకు ప్రసంగించి అనంతరం వరంగల్ బయలుదేరి వెడతారు. కేంద్ర హోం మంత్రి రాకతో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.