ఇరాన్‌పై దాడులకు అమెరికా సిద్ధం!
మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా తన సైనిక బలగాలను భారీగా మోహరిస్తోంది. ఇరాన్‌పై దాడులకు అమెరికా సిద్ధమవుతున్నట్లు వస్తున్న వార్తలకు బలం చేకూరుస్తూ, ఆ దేశం తన అత్యాధునిక యుద్ధ విమానాలను, ఇంధన ట్యాంకర్లను , రవాణా విమానాలను మిడిల్ ఈస్ట్ వైపు తరలిస్తోంది. రెండు దేశాల మధ్య అణు ఒప్పందం కోసం జరిగిన చర్చలు విఫలమవ్వడం, ఇరాన్ అణుబాంబు తయారీ దిశగా అడుగులు వేస్తుండటమే ఈ ఉద్రిక్తతలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
ఫ్లైట్ రాడార్ విడుదల చేసిన తాజా దృశ్యాల ప్రకారం, జర్మనీ, ఇటలీ ,అమెరికాలోని వివిధ సైనిక స్థావరాల నుండి ఎఫ్-16 ఫైటింగ్ ఫాల్కన్స్, ఎఫ్-15ఈ స్ట్రైకర్ ఈగల్స్ , అత్యంత శక్తివంతమైన ఎఫ్-22 రాప్టార్స్ యుద్ధ విమానాలు మధ్యప్రాచ్యానికి చేరుకున్నాయి. గతంలో ఇరాన్ అణు స్థావరాలపై నిఘా పెట్టేందుకు , దాడులు చేసేందుకు అమెరికా ఎఫ్-22 రాప్టార్స్‌ను ఉపయోగించిన చరిత్ర ఉంది. ఇరాన్ తన యురేనియం నిల్వలను పెంచుకోవడం వెంటనే ఆపేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా హెచ్చరించిన నేపథ్యంలో, అమెరికా అధికారులు ఏ క్షణమైనా ఇరాన్ భద్రతా స్థావరాలు లేదా వారి నాయకులను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని సమాచారం.
మరోవైపు, అమెరికా కదలికలను ఇరాన్ కూడా నిశితంగా గమనిస్తోంది. తమ దేశంపై ఎలాంటి దాడులు జరిగినా తీవ్రంగా ప్రతిఘటిస్తామని మరియు ప్రతి దాడులు చేస్తామని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది. అగ్రరాజ్యం అమెరికా యుద్ధ విమానాలను మొహరించడం చూస్తుంటే, మధ్యప్రాచ్యంలో ఏ క్షణమైనా పెను యుద్ధం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రపంచ దేశాలు ఈ పరిణామాలను ఆందోళనతో గమనిస్తున్నాయి.

