NationalNews

కర్నాటకలో అపూర్వ దృశ్యం.. రాహుల్ పాదయాత్రలో సోనియా

రాహుల్ యాత్రలో పాల్గొన్న సోనియా గాంధీ
కర్నాటక మైసూర్ ఆసక్తికర ఘట్టం
సోనియాతో కలిసిన నడిచిన రాహుల్ గాంధీ
సోనియా రాకతో పార్టీ నేతల్లో కొత్త ఉత్సాహం
కర్నాటక అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ గురి

అమ్మతో కలిసి పాదయాత్ర చేసి మురిసిపోయారు రాహుల్ గాంధీ. భారత్ జోడో యాత్రలో భాగంగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర నిర్వహించాలని తలపెట్టిన రాహుల్ గాంధీ.. యాత్ర ప్రస్తుతం కర్నాటకలో సాగుతోంది. ఈ యాత్రలో సోనియా గాంధీ పాల్గొనడంతో పార్టీ నేతల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. అనారోగ్యం కారణంగా గత కొంతకాలంగా ఆమె బయటకు రాని సోనియా.. కుమారుడి పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. మాండ్యాలో రాహుల్ గాంధీ మార్చ్‌లో పార్టీ కార్యకర్తలతో కలిసి కొంతదూరం సోనియా నడిచారు. త్వరలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. రాహుల్ యాత్ర.. పార్టీకి కీలకంగా మారింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి గానూ… బళ్లారిలో జరిగే ర్యాలీలో సోనియా ప్రసంగిస్తారు. బేగూర్ గ్రామంలోని ఆలయాన్ని సందర్శించి సోనియా ప్రార్థనలు చేశారు.

సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన కాంగ్రెస్ దేశవ్యాప్త కార్యక్రమం… సెప్టెంబర్ 30న కర్ణాటకలో ప్రవేశించింది. ఆయుధ పూజ, విజయదశమి కారణంగా రెండ్రోజులు విశ్రాంతి ఇచ్చారు. కర్ణాటకలో “భారత్ జోడో యాత్ర”లో పాల్గొనేందుకు సోనియా గాంధీ సోమవారం మధ్యాహ్నం మైసూరు చేరుకున్నారు. సోనియా గాంధీ పాదయాత్రలో పాల్గొనడం పార్టీకి గర్వకారణమని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ అన్నారు. విజయదశమి తర్వాత, కర్నాటకలో విజయోత్సవం ఉంటుందని… వీధుల్లో సోనియాగాంధీ పాదయాత్రగా వచ్చినందుకు గర్విస్తున్నామన్నారు డీకే శివకుమార్. రాష్ట్రంలో అధికారంలోకి వస్తున్నామని… పాదయాత్రకు వస్తున్న రెస్పాన్స్ స్పష్టం చేస్తోందన్న శివకుమార్… కర్నాటకలో బీజేపీ సర్కారు ఓడిపోతుందని జోస్యం చెప్పారు.

రాహుల్ గాంధీ 12 రాష్ట్రాలలో 3,570 కి.మీ నడిచేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. యునైటెడ్ ఇండియా నినాదంతో ఆయన భారత్ జోడో యాత్రను చేపట్టారు. రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నాయకులు కంటైనర్లలో నిద్రిస్తూ.. సాగిస్తున్న యాత్ర.. పార్టీకి ఊపు తీసుకొస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. 25 ఏళ్ల తర్వాత గాంధీ కుటుంబం నుంచి బయట వ్యక్తిని ఏఐసీసీ చీఫ్ గా నియమించేందుకు రంగం సిద్ధమవుతున్న తరుణంలో సోనియా, రాహుల్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ఎవరికీ కూడా మద్దతివ్వరాదని గాంధీలు నిర్ణయించారు. శశి థరూర్ లేదా మల్లికార్జున్ ఖర్గేలను ఆమోదించబోమని ప్రకటించారు. గాంధీలకు సన్నిహితుడైన ఖర్గే కాంగ్రెస్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా గెలుస్తారన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది.