అమరనాథ్ యాత్ర నా శక్తిని, ధైర్యాన్ని ఛాలెంజ్ చేసింది
తన తల్లిదండ్రులతో తాను సాగించిన అమరనాథ్ యాత్ర విశేషాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది సాయిపల్లవి. అమరనాథ్ యాత్ర అనుభవం తన శక్తిని, ధైర్యాన్ని, మనోబలాన్ని ఛాలెంజ్ చేసినట్లు అనిపించిందని వివరించింది. సాధారణంగా వ్యక్తిగత విషయాలు పంచుకోని సాయిపల్లవి సోషల్ మీడియాకు దూరంగానే ఉంటుంది. కానీ చాలాకాలంగా వెళ్లాలనుకుంటూ వాయిదా వేస్తూ వస్తున్న అమరనాథ్ యాత్రకు వెళ్లివచ్చానని, ఆ విశేషాలను అభిమానులతో పంచుకోవడం ఎంతో ఆనందాన్ని ఇస్తోందని తెలియజేసింది. తన తల్లిదండ్రులతో కలిసి ఈ యాత్రకు వెళ్లానని, వాళ్లు కొన్నిసార్లు శ్వాస సంబంధ సమస్యతో బాధపడడం, అలసి పోవడం చూసానని, దీనితో ‘ఈశ్వరా, ఎందుకంత దూరంగా ఉన్నారు?’ అని ప్రశ్నించాలని అనిపించిందన్నారు. కానీ ధవళ వర్ణంలో వెలిగిపోతున్న ఆ అమరలింగాన్ని చూసి, నోటమాట రాలేదని, దైవ దర్శనం అనంతరం ఎంతో ప్రశాంతంగా అనిపించిందని పేర్కొన్నారు. కొండ దిగి వచ్చేటప్పుడు యాత్రకు వెళుతున్న వారిలో ధైర్యం నింపడానికి తోటి యాత్రికులు ‘ఓం నమః శివాయః’ మంత్రోచ్ఛారణ చేస్తూ గట్టిగా స్మరించడం చూసి, అందరూ ఉత్తేజంతో నడక కొనసాగించారని తెలిపారు. ఈ యాత్రతో జీవితమే ఒక ప్రయాణం అని తెలిసివచ్చిందన్నారు. నిస్వార్థ సేవలకు సాక్షిగా నిలిచిన ఈ ప్రదేశం ఎంతో పవిత్రమైనదని గ్రహించానని పేర్కొంది. ఈ యాత్రకు సహాయం చేస్తున్న శ్రీఅమరనాథ్ పుణ్యక్షేత్రం బోర్డులోని ప్రతి ఒక్కరికీ తన ప్రణామాలు తెలియజేసింది. వరదల్లో, అనుకోని వాతావరణ పరిస్థితులలో యాత్రికులను రక్షిస్తున్న ఆర్మీ, సీఆర్‌పీఎఫ్ సిబ్బందికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఈ ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో పేర్కొంది సాయిపల్లవి.


