ఐదేళ్లూ, ప్రజల తోడై ఉంటా: ఈటల రాజేందర్
గెలుపు గెలుపే, ఓటమి ఓటమే
2002లో ప్రజా జీవితంలోకి వచ్చా
ఈ ఐదేళ్లు ప్రజలతోనే ఉంటా
ప్రజలను కలవండి, ప్రజలే ముఖ్యం: స్పష్టం చేసిన ఈటల
తూప్రాన్ –
కేసీఆర్ అంతటి నియంత పైన పోటీ చేయడం అంత చిన్న విషయం కాదని, దానికి చాలా సాహసం ధైర్యం కావాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తూప్రాన్ లోని స్థానిక ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన ఆయన గెలిచిన ఓడిన తాను ప్రజలతోనే నిరంతరం ఉంటానని, 2002 నుండి తాను రాజకీయాల్లో ఉన్నానని, సాధారణ ప్రజలను విడిచి తాను ఉండలేనని తెలిపారు. కార్యకర్తలు, ప్రజలు గజ్వేల్ నియోజకవర్గంలో ఓట్లతో తనపై చూపెట్టిన అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయమంటే ఒక్క రోజుతో అయిపోయేది కాదని నిరంతరం ప్రజలతోనే ఉన్నప్పుడే విజయాలు సొంతమవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఏదేమైనా గెలుపు గెలుపేనని, ఓటమి ఓటమేనని గెలిచినవారు ప్రజలకు చేయాలని ఆయన సూచించారు.

తెలంగాణ రాష్ట్రం అత్యధిక అప్పులతో కూనరిల్లిపోయిందని, సంక్షేమ పథకాలను, అభివృద్ధిని సమతూకంగా గెలిచిన ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలని ఈటల రాజేందర్ కోరారు. కేసీఆర్ ప్రజలకు ఉపయోగపడని పైగా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే అనేక పథకాలను అమలు చేస్తూ ఉంటే ఆర్థిక మంత్రిగా తాను వద్దని చెప్పానని, వినకుండా నిరుద్యోగ భృతి ఇవ్వకుండా తప్పించుకున్నాడని చెప్పారు. దళిత బంధు పథకాన్ని కనీసం గజ్వేల్ ప్రజలకు కూడా ఇవ్వలేదని వాపోయారు. తాను తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రిగా పని చేశానని ఆ అనుభవంతోనే ఈ విషయాలన్నీ చెబుతున్నానని తెలియజేశారు. ఈ సందర్భంగా తూప్రాన్ పట్టణం, మండలంలోని కార్యకర్తలు పెద్ద ఎత్తున సభకు విచ్చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

