Home Page SliderNational

సిసోడియాను తీహార్ జైళ్లో చంపేందుకు కుట్ర ఆరోపణలపై భగ్గుమన్న జైళ్ల శాఖ

ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియాను తీహార్ జైలులో హత్య చేసేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలను ఢిల్లీ జైళ్ల శాఖ తీవ్రంగా స్పందించింది. ఆప్ నెం.2 , ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా గత నెలలో లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన తర్వాత జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. సిసోడియా బెయిల్ పిటిషన్ శుక్రవారం విచారణకు రానుంది. సిసోడియా భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక వార్డులో ఉంచామంది జైళ్ల శాఖ. సీజే-1 వార్డులో గ్యాంగ్‌స్టర్లు కానీ, జైలు లోపల మంచి ప్రవర్తన కలిగిన ఖైదీలు పరిమితమైన సంఖ్యలో ఉంటారంది. సిసోడియా ప్రమాదకరమైన, క్రూరమైన ఖైదీల మధ్య ఉంచారన్న ఆప్ ఆరోపణపై జైళ్ల శాఖ స్పందించింది.

“ప్రత్యేక సెల్‌లో ఎటువంటి భంగం కలగకుండా ధ్యానం చేసుకునేందుకు వీలు కల్పించామంది. జైలు నిబంధనల ప్రకారం, రక్షణ, భద్రతను నిర్ధారించడానికి అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. బస గురించి ఏవైనా అనుమానాలు ఉంటే అవి నిరాధారమైనవి” జైళ్ల శాఖ పేర్కొంది. “డజన్ల కొద్దీ హత్య కేసులను ఎదుర్కొంటున్న, ఎవరినైనా చంపగల” దేశంలోని అత్యంత ప్రమాదకరమైన నేరస్తులతో సిసోడియా జైలులో ఉన్నారని AAP నాయకులు ఆరోపణలతో జైళ్ల శాఖ కౌంటర్ ఇచ్చింది. మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న ఆప్ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్, బీజేపీ నమ్ముతున్న రాజకీయ పోటీ ఇదేనా అంటూ ప్రశ్నించాడు. ‘ఢిల్లీలో మమ్మల్ని ఓడించలేకపోయారు.. ఎంసీడీ ఎన్నికల్లో మమ్మల్ని ఓడించలేకపోయారు.. మీరు ఎన్ని కుట్రలు పన్నినా మా అభ్యర్థులు మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులకు ఎన్నికయ్యారు.. ఈ విషయంలో ప్రధాని మౌనం ప్రతి ఒక్కరూ చూడాల్సిందే. ” అంటూ దుయ్యబట్టాడు. “కేంద్రం రాజకీయ హత్యలను ఇంజనీర్ చేస్తుందా అని ఆందోళన చెందుతున్నాం?” అని ఆక్షేపించాడు.

ఈ ఆరోపణలను ఆప్ సీనియర్ నేత, ఎంపీ సంజయ్ సింగ్ పునరుద్ఘాటించారు. సిసోడియా “జైలులో హత్య చేయొచ్చు” అని ఆప్ ఆందోళన చెందుతోందని వ్యాఖ్యానించారు. “ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, సిసోడియాతో శత్రుత్వం ఏంటి, ఎందుకంత ద్వేషం? ఆయనను ధ్యాన జైలులో ఉంచడానికి కోర్టు అనుమతించినప్పుడు, ఆ ఆదేశాలను ఎందుకు పాటించడం లేదు?” అంటూ మండిపడ్డారు. సిసోడియాను 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపిన ప్రత్యేక కోర్టు, ఆయనను ధ్యాన గదిలో ఉంచాలన్న అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని సోమవారం జైలు అధికారులను ఆదేశించింది.