ఏపీ అభివృద్ధిలో క్రెడాయ్ కీలకపాత్ర-ఆళ్ల అయోధ్యరామిరెడ్డి విశ్వాసం
రాష్ట్ర విభజన జరిగి ఇప్పుడిప్పుడే అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్న నవ్యాంధ్ర ప్రదేశ్ అభివృద్ధిలో బిల్డర్స్ పాత్ర చాలా కీలకం అని రాజ్య సభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం విజయవాడ క్లబ్ లో “క్రెడాయ్ ఆంధ్ర ప్రదేశ్” ఆధ్వర్యంలో “స్పోర్ట్స్ మీట్” ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజ్య సభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి క్రెడాయ్ సంస్థ బృందం ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ… నిత్యం వ్యాపార పనుల్లో బిజీగా ఉండే వారికి ఉపశమనం కల్పించేందుకు క్రీడలు నిర్వహించటం మంచి పరిణామం అన్నారు.

బిల్డర్స్ కు ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అభివృద్ధి చెందుతున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో క్రెడాయ్ ఓ మంచి పిల్లర్ కావాలి అని సూచించారు. దానికి తన వంతు సహకారం అప్పుడు ఉంటుంది అని తెలిపారు. ఆ తర్వాత ఆళ్ల కొద్దిసేపు క్రికెట్ ఆడి స్పోర్ట్స్ మీట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ ఆంధ్ర ప్రదేశ్ ఛైర్మన్ ఎస్.వెంకట రామయ్య, ప్రెసిడెంట్ బి. రాజ శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్స్ పి.రాజశేఖర్ రావు, వై.వి రామారావు, ఎస్.వి.ఎం చంద్రశేఖర్, జనరల్ సెక్రెటరీ కె.ఎస్.సి బోస్, అడ్వైజర్ ఆళ్ల శివారెడ్డి పలువురు పాల్గొన్నారు.


