Andhra Pradesh

వైసీపీ ప్రభుత్వం మళ్లించుకున్న పల్లెల నిధులన్నీ వెనక్కిచ్చేసి గ్రామ సచివాలయాల్ని పంచాయతీల్లో విలీనం చేయాలి !

మహాత్మాగాంధీ కలలు కన్న గ్రాస స్వరాజ్యాన్ని ప్రధాని మోదీ సాకారం చేసేందుకు ప్రయత్నిస్తూంటే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సచివాలయాల పేరుతో ప్రత్యామ్నాయ వ్యవస్థలను పెట్టి, కేంద్రం పంచాయతీలకు ఇచ్చే నిధుల్ని దారి మళ్ళించడం బాద్యతారాహిత్యమన్నారు బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా నాలుగేళ్ల పాటు పంచాయతీ నిధుల్ని పూర్తి స్థాయిలో దారి మళ్లించారన్నారు. సర్పంచ్‌లు కనీసం వెయ్యి రూపాయలు పెట్టి అభివృద్ధి పనులు చేయలేనంత దుస్థితిలోకి వెళ్లిపోయారన్నారు. పలు చోట్ల తమ స్వంత పార్టీ నేతలే ఉద్యమాలు చేసే పరిస్థితులు కనిపిస్తూండటమే ప్రభుత్వ నిర్వాకానికి అసలైన సాక్ష్యమన్నారు. ఏ పంచాయతీలోనూ పనులు చేయడానికి నిధులు లేవని, గత నాలుగేళ్ల కాలంలో దాదాపుగా 8వేల కోట్ల రూపాయలు కేంద్రం గ్రామ పంచాయతీలకు ఇచ్చిందన్నారు. ప్రతి సారి రాష్ట్ర ప్రభుత్వమే దారి మళ్లించుకుందన్నారు. చివరికి కేంద్రం.. సీఎఫ్ఎంఎస్ ఖాతాలు తెరవాలని చెబితే అందులోనూ అక్రమాలకు పాల్పడ్డారన్నారు. భారతీయజనతా పార్టీ ఉద్యమ బాట పడితే అరకొరగా కొన్ని నిధుల్ని జమ చేస్తున్నారని, తీసుకున్న నిధులన్నీ పంచాయతీల ఖాతాలో జమ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. పంచాయతీల ఖాతాల్లో నిధులను సర్పంచ్ సంతకం లేకుండా మళ్లించడం సైబర్ నేరమని… దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనన్నారు.

రాష్ట్రంలో 85 శాతం మంది సర్పంచ్‌లు మా పార్టీ వారేనని.. వారిని తాము ఎందుకు కష్టపెట్టుకుంటామని వైసీపీ నేతలు కల్లిబొల్లి కబుర్లు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు విష్ణువర్థన్ రెడ్డి. రోడ్డెక్కిన సర్పంచ్‌లు అంతా మీవాళ్లేనని మీకు తెలియనట్లు నటించడం మీ పార్టీని మీరు మోసం చేసుకోవడమేనన్నారు. నిధులు ఇప్పించాలని ..మద్దతుగా పోరాడాలని బీజేపీని కోరింది కూడా వైసీపీ సర్పంచ్‌లేనని గుర్తు చేశారు. వైసీపీ సర్పంచ్‌లంతా లబోదిబోమంటున్నారన్న సంగతి ప్రభుత్వానికి తెలియదా అంటూ మండిపడ్డారు. రైతు భ‌రోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్‌లు, గ్రామ స‌చివాల‌యాలు కట్టామని అబద్దాలు చెబుతున్నారన్నారు. గ్రామ ప్రజలకు సేవ చేసేందుకు ఆర్థిక సంఘం నిధులతో వాటిని కట్టారని నిస్సిగ్గుగా అబద్దాలు ఎలా చెప్పగలుగుతున్నారని ప్రశ్నించారు. వాటన్నింటికీ కేంద్రం వివిధ పథకాలతో పాటు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూడా నిధులిచ్చిన విషయం ఎవరికీ తెలియదనుకుంటున్నారా ?. చేసింది తప్పుడు పని దానిని సమర్థించుకోవడానికి మళ్లీ అడ్డగోలు వాదనలు చేస్తారా ? అంటూ విష్ణువర్థన్ రెడ్డి మండిపడ్డారు.

పంచాయతీలకు పోటీగా గ్రామ సచివాలయాలను ఎందుకు పెట్టారని ఆయన ప్రశ్నించారు. గ్రామ పంచాయతీల నిధులు మళ్లించి.. గ్రామ సచివాలయాలు.. సమస్యల పరిష్కారం కోసం అంటూ రూ. 20 లక్షలు ఏ అధికారంతో రిలీజ్ చేశారన్నారు. పంచాయతీలను నిర్వీర్యం చేసి… సర్పంచ్‌లను ఉత్సవ విగ్రహాలుగా చేయడానికి చేసిన కుట్ర బహిరంగంగానే కనిపిస్తోందన్నారు. సర్పంచ్‌ల అధికారాలను వీఆర్వోలకు కట్టబెట్టాడనికి ఇచ్చిన జీవోను హైకోర్టు కొట్టి వేసినా… ప్రయోజనం లేకపోయిందన్నారు. ఇప్పుడు సర్పంచ్‌లు ఉత్సవ విగ్రహాలు అయిపోయారని, గ్రామ పంచాయతీలు నిర్వీర్యం అయిపోతున్నాయన్నారు. పంచాయతీల ఉనికిని ప్రశ్నార్థం చేసేందుకే నిధుల్ని స్వాహా చేసి.. గ్రామ సచివాలయాల్ని బలోపేతం చేసే కుట్ర చేస్తున్నారని విష్ణు విమర్శించారు. తక్షణం గ్రామ పంచాయతీలకు పూర్వ అధికారాలన్నీ ఇవ్వాలన్నారు. కేంద్రం ఇచ్చే ఆర్థిక సంఘం నిధులు మాత్రమే కాదు.. రాష్ట్రం నుంచి రావాల్సిన నిధులు.. ఏకగ్రీవం చేసుకున్నందుకు ఇస్తామన్న నిధులు కూడా వెంటనే విడుదల చేయాలన్నారు.

గ్రామ సచివాలయాల్ని పంచాయతీల్లో విలీనం చేయాలని, సర్పంచ్‌కే పూర్తి స్తాయి ప్రజాస్వామ్య అధికారులు కల్పించాలన్నారు. లేకపోతే.. పల్లెలకు చేస్తున్న ద్రోహం… రాజ్యాంగ ద్రోహమే అవుతుందన్నారు. గత మూడేళ్లుగా ఆర్థిక సంఘం నిధులు కేంద్రం నుంచి పంచాయతీలకు ఎంత వచ్చాయి..? ఎన్ని మళ్లించుకున్నారు ? పంచాయతీలకు న్యాయంగా ఇవ్వాల్సిన నిధుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇచ్చింది ?. గ్రామపంచాయతీ పనులను సచివాలయాలతో ఏమేమి చేయిస్తున్నారు ? ఈ వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని విష్ణువర్థన్ రెడ్డి డిమాండ్ చేశారు. పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుందని మహాత్మగాందీ చెబుతారు పల్లెలపై కుట్రలు చేస్తే.. దేశంపై చేసినట్లే. దీన్ని గుర్తుంచుకుని మసలుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని హచ్చరిస్తున్నామన్నారు. తిరుపతిలో జరిగిన ఆందోళనా కార్యక్రమంలో బీజేపి నేతలు దయాకర్ రెడ్డి, సామంచి శ్రీనివాస్, సత్యనారాయణ కోలా ఆనంద్ , జనసేన పార్టీ నేతలు రాజారెడ్డి, కీర్థనా, తదితర నేతలు ఇరు పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తిన పాల్గొన్నారు.