అన్ని పార్టీల చూపు ఎమ్మెల్యే రాపాక వైపు
• రాపాక వరప్రసాద్ అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేయించాలని అన్ని పార్టీలు గట్టిగా కృషి
• దొంగ ఓట్లతోనే తాను గెలిచానని చేసిన వ్యాఖ్యలు తో మొదలైన కలకలం
• ఉప ఎన్నిక కోసమే అన్ని పార్టీల వ్యూహాలు
• రాజోలు నియోజకవర్గం రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ప్రీ ఫైనల్ గా మారనుందా ?
ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున రాజోలు నియోజకవర్గం నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తాను దొంగ ఓట్లతోనే గెలిచానని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో రాజకీయ వాతావరణాన్ని పూర్తిగా మార్చేలాగా ఉన్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యల ద్వారా అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆయన అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేయించాలని గట్టిగా కృషి చేస్తున్నాయి. ఈ విషయంలో అన్ని పార్టీలకు ఇప్పుడు రాపాక వరప్రసాద్ లక్ష్యంగా మారారు. దొంగ ఓట్లతోనే తాను గెలిచాను అంటూ చేసిన వ్యాఖ్యల ఒరిజినల్ వీడియోల కోసం ఇటు జనసేన, తెలుగుదేశం కార్యకర్తలు, అటు రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ విభాగం కూడా గట్టిగానే ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే రాపాక వరప్రసాద్ పేరు చెబితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసైనికులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. తమ ప్రచారం, ఆర్థిక సహకారంతో గెలుపొందిన వరప్రసాద్ స్వార్థంతోనే అధికార పార్టీ పంచన చేరడంతో పాటు తన విజయం కోసం కృషి చేసిన జనసేన కార్యకర్తలపై కేసులు పెట్టి వేధించటంతో రాజోలు నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసేన కార్యకర్తలు ఆయన తీరుపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రాపాక వరప్రసాద్ ఇప్పుడు తాను దొంగ ఓట్లతోనే నెగ్గానంటూ అంతర్వేదిలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్సిపీ ఆత్మీయ సభలో బహిరంగంగానే వ్యాఖ్యలు చేయడం తన స్వగ్రామం చింతలమొరిలో తన అనుచరులు ఒక్కొక్కరు పది నుంచి పదిహేను దొంగ ఓట్లు వేశారని ఆ గ్రామ ఓట్ల కౌంటింగ్ సమయంలోనే తనకు మెజార్టీ లబించిందని తన గెలుపు జనసేన వల్ల కాదని తనకు వేసిన దొంగ ఓట్ల వల్లనే అంటూ స్పష్టం చేయడంతో ఈ వ్యాఖ్యలపై జనసైనికులు మరింత కోపోద్రేక్తులవుతున్నారు. దీంతో ఆ ఒరిజినల్ వీడియోను ఎన్నికల కమిషన్ కు పంపించి అతని శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయించాలని ఆ పార్టీ శ్రేణులు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి.

అలాగే వరుసగా మండలి ఎన్నికల్లో విజయం సాధించిన తెలుగుదేశం శ్రేణుల్లో మరింత ఉత్సాహం విశ్వాసం నింపేందుకు వీలుగా ఉప ఎన్నికల ఎదుర్కొనేందుకు తెలుగుదేశం పార్టీ వ్యూహాలు అమలు చేస్తుంది. తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాసింగ్ ఓటింగ్ వేసిన ఆ ఎమ్మెల్యేలని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన అధికార పార్టీకి అనుకూలంగా వారు ఉండటంతో వారి శాసనసభ సభ్యత్వాలపై వేటు వేసే అవకాశాలు లేవు. పైగా నలుగురుని బయటకు పంపితే తెలుగుదేశం పార్టీ శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోతుంది. చంద్రబాబు క్యాబినెట్ ర్యాంకు కూడా పోతోంది. దీంతో తెలుగుదేశం పార్టీ వారి ఎమ్మెల్యేల జోలికి పోకుండా రాపాక వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయించి ఉపఎన్నికకి వెళ్తే రాజోలులో తమ పార్టీ సామర్ధ్యాన్ని నిరూపించుకొని ఆ పార్టీ శ్రేణుల్ని వచ్చే ఎన్నికలుగా దిశగా నడిపించవచ్చని భావిస్తుంది.

ఇక అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనూ రాపాక వరప్రసాద్ సభ్యత్వాన్ని తొలగించి ఉప ఎన్నికను ఎదుర్కోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మండలి ఎన్నికల్లో కాస్త పట్టు నిరూపించుకున్న తెలుగుదేశం ఇది ఆరంభమే అంటూ చేస్తున్న ప్రకటనలకు ఆదిలోనే అడ్డం కొట్టాలని ఆశిస్తోంది. ఇందుకోసం ఉప ఎన్నికకు వెళ్ళాలని అంచనాలేస్తోంది. ఇందుకు రాపాక వరప్రసాద్ ఇప్పుడు అందరికీ అనువుగా మారారు. ఒకవేళ రాపాక వరప్రసాద్ సభ్యత్వం రద్దు అయితే ఉప ఎన్నికలు వస్తే దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని తమ అభ్యర్థిని గెలిపించుకొని తెలుగుదేశం పార్టీలో కనిపిస్తున్న విశ్వాసంపై గట్టి దెబ్బ కొట్టాలాని… వైఎస్ఆర్సిపీ అంచనాలు వేస్తోంది. ఇలా ఇప్పుడు అన్ని పార్టీలకు రాపాక వరప్రసాద్ లక్ష్యంగా మారారు. అన్ని పార్టీలు రాజోలులో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఉప ఎన్నిక వస్తే దానిని ఫ్రీ ఫైనల్ గా చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరి రాపాక వరప్రసాద్ అసెంబ్లీ సభ్యత్వం రద్దు అవుతుందా లేదా ఉప ఎన్నిక జరుగుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది.

