ర్యాగింగ్ విషయంలో మెడికల్ కాలేజీలు కఠినంగా ఉండాలి-మంత్రి రజని
ర్యాగింగ్ విషయంలో రాష్ట్రంలోని అన్ని మెడికల్ కళాశాలలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజిని తెలిపారు. వరంగల్ జిల్లాలో మెడికో ఆత్మహత్య ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ,ప్రైవేటు మెడికల్ కళాశాల ప్రిన్సిపాళ్లతో మంగళగిరిలోని ఏపీఐఐసీ టవర్స్‌లో ఉన్న వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ర్యాగింగ్ విషయంలో అన్ని మెడికల్ కళాశాలల కఠినంగా ఉండాలని తెలిపారు. మెడికోలు పై ఎక్కడ ఎలాంటి వేధింపులు ఉండటానికి వీల్లేదు అన్నారు. కాలేజీల్లో యాంటీ ర్యాగింగ్ కమిటీలు పూర్తిస్థాయిలో చురుకుగా పని చేయాలని ఇతర వేధింపులకు సంబంధించి ఆయా కళాశాలపై నేరుగా డీఎంఈ, హెల్త్ యూనివర్సిటీ వీసీ పర్యవేక్షణ ఉండాలన్నారు.

ఆయా కళాశాల నుంచి ఎప్పటికప్పుడు యాంటీ ర్యాగింగ్ కమిటీల ద్వారా నివేదికలు తెప్పించుకుంటూ ఉండాలన్నారు. విద్యార్థులతో బోధన సిబ్బంది సహృదయ భావంతో ఉండాలని కొంతమంది సీనియర్ అధ్యాపకులు వారి సొంత క్లినిక్‌ల నేపథ్యంలో పీజీ విద్యార్థులపై పని భారం మోపుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయని ఈ పద్ధతి మారాలని హెచ్చరించారు. అన్ని మెడికల్ కళాశాలలలో విద్యార్థులకు కౌన్సిలింగ్ సెషన్లు ఉండేలా చూసుకోవాలన్నారు. ఒత్తిడి నుంచి బయటపడేలా విద్యార్థులకు యోగ ధ్యానం లాంటి అంశాలపై అవగాహన పెంచాలన్నారు. కాలేజీల్లో ఫిర్యాదుల బాక్సును అందుబాటులో ఉంచాలన్నారు. ఏదైనా సమాచారాన్ని వెను వెంటనే చేరేలా క్యాంపస్‌లో పలుచోట్ల మైకులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉండేలా చూడాలన్నారు. ప్రతి విద్యార్థిని దిశా యాప్ ను వాడుకునేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

