జగన్ పై పల్లా ఫైర్ : చంద్రబాబుకు విజనరీ క్రెడిట్
విశాఖపట్నం : మాజీ ముఖ్యమంత్రి జగన్ పై రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తీవ్ర విమర్శలు కురిపించారు. తిరుమల శ్రీవారి పవిత్ర నామాన్ని రాజకీయాల కోసం వాడుకున్నారని మండిపడ్డారు. సనాతన ధర్మం అంటే ఏంటో కూడా అర్థం కాని జగన్ కి శ్రీ వేంకటేశ్వర స్వామి గురించి మాట్లాడే అర్హత లేదు అని తీవ్రంగా విమర్శించారు. స్వామి వారు కోట్లాది హిందువుల విశ్వాసం. భక్తులు కష్టపడి సంపాదించి స్వామివారికి సమర్పించిన మొక్కుబడులను కూడా దోచుకునే ధైర్యం జగన్ పాలనలోనే కనబడిందని పల్లా ఆరోపించారు. తిరుమల దేవాలయ వ్యవహారాల్లో జరిగిన అవకతవకలు భక్తుల భావాలను తీవ్రంగా దెబ్బతీసాయని ఆయన తెలిపారు.
పరకామణి కేసు ఘటనే, “దొంగ చేతికి అధికారం ఇస్తే ఏ స్థాయిలో అయోమయం, అవినీతి జరుగుతుందో చెప్పే తార్కాణం” అని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ మూడు రోజులకు ఒక్కసారి మీడియా ముందుకు వచ్చి “నేను ఉన్నా… మా పార్టీ ఉంది” అని నటించడం ప్రజలు చూసి నవ్వుకుంటున్నారని పల్లా విమర్శించారు. “నీ నోటి వెంట నిజం రాదు… నిద్రలో లేపి దేవుడి గురించైనా అడిగినా అబద్ధమే చెప్తావు. ఎందుకంటే నీలో భక్తి లేదు, భయం లేదు” అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక్క చుక్క పాలు కూడా లేకుండా తయారు చేసిన నెయ్యిని శ్రీవారి ప్రసాదంలో ఉపయోగించడం అవినీతి మాత్రమే కాక, “మహా పాపం మరియు ధార్మిక ద్రోహం” అని ఆయన ఆరోపించారు. శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడటం ద్వారా కోటానుకోట్ల భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీశారని పల్లా తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో టెండర్ పిలుపు నుండి సరఫరా ప్రారంభం అయ్యే వరకు అన్ని చర్యలు వైసీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని ఆయన స్పష్టం చేశారు. అంతేకాక, చంద్రబాబు ప్రమాణ స్వీకార రోజునే నెయ్యి సరఫరా ప్రారంభించటాన్ని “కుట్ర, ముందుగా పన్నిన రాజకీయ ప్రయత్నం”గా పల్లా ఖండించారు. ఈ చర్యలు తిరుమల ఆలయ పరిపాలనలో ఉన్న లోపాలు, గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని బయటపెడుతున్నాయని పల్లా పేర్కొన్నారు. తిరుమల దేవాలయ ఆచారాలలో మాజీ సీఎం జగన్‌కు అవగాహన లేదని పల్లా మండిపడ్డారు. “గుడిలో చెప్పులు వేసుకుని రాకూడదన్న సాధారణ ఆచారం కూడా తెలియని వ్యక్తి తిరుమల నియమాల గురించి ఉపన్యాసాలు చేయడం భక్తుల మనోభావాలపై దాడిలాంటి విషయం” అని ఆయన విమర్శించారు. అలాగే, వేంకటేశ్వర స్వామికి సతీసమేతంగా పట్టువస్త్రాలు సమర్పించాలి అనే సంప్రదాయం కూడా జగన్ కు తెలియదని, ఇలాంటి ప్రాథమిక ఆచారాలపై అవగాహన లేకుండానే ఆయన వ్యాఖ్యలు చేయడం బాధాకరమని పల్లా అన్నారు.
న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులు, సీనియర్ ఐఏఎస్ అధికారులను అగౌరవంగా సంబోధించడం, చివరికి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా చులకనగా మాట్లాడటం… ఇవన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అహంకార స్వభావానికి ప్రతిబింబమని విమర్శలు కురిపించారు. ఆంధ్రప్రదేశ్‌ను గంజాయి వనంగా మార్చి, కల్తీ మద్యంతో వేలాది కుటుంబాలను దుఃఖంలో ముంచాడు. రాష్ట్రం మొత్తం నేరాలు, డ్రగ్స్, కల్తీ మద్యం దందాలతో పరువు పోయేలా చేసి, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్‌ను దేశంలోనే అత్యంత హీన స్థితికి నెట్టాడు. ఇలాంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన విజనరీ లీడర్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్ కలిసి ఆంధ్రప్రదేశ్ ను మళ్లీ గౌరవప్రదమైన దిశగా నడిపిస్తూ, ప్రపంచ పటంలో రాష్ట్ర ప్రతిష్ఠను పెంచుతున్నారని పేర్కొన్నారు.ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు, అభివృద్ధి అవకాశాలను ఆకర్షించేలా ‘న్యూ ఏపీ బ్రాండ్’ను పునర్నిర్మించడం, రాష్ట్ర భవిష్యత్తుకు స్పష్టమైన మార్గరేఖలు వేస్తున్నారన్నారు. పరిశ్రమలు, టెక్నాలజీ, మౌలిక వసతుల విస్తరణతో ఆంధ్రప్రదేశ్‌ను సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్న ఈ నాయకత్వాన్ని వ్యాపార వర్గాలు, నిపుణులు కూడా మెచ్చుకుంటున్నారు.

