Andhra PradeshHome Page Slider

అధిక సంఖ్యలో సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం

◆పదిరోజుల దర్శనం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం
◆శ్రీవారి దర్శనానికి టోకెన్ తీసుకునే రండి
◆భక్తులు తప్పని సరిగా మాస్క్ ధరించాలి
◆ జనవరి 1, 2 తేదీల్లో సిఫారసు లేఖలు స్వీకరిం
చం
◆టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వెల్లడి

సామాన్య భక్తులకు ఎక్కువ సంఖ్యలో వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో జనవరి 2 నుండి 11వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని బోర్డు నిర్ణయం తీసుకుందని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన తెలిపారు. ఈవో అనిల్ కుమార్ సింఘాల్ , జిల్లా కలెక్టర్ వెంకటరమణా రెడ్డి , అదనపు ఈవో వీరబ్రహ్మం , జేఈవో శ సదా భార్గవి, టీటీడీ సీవీఎస్వో నరసింహ కిషోర్ , జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి ఇతర అధికారులతో మంగళవారం సాయంత్రం తిరుమల అన్నమయ్య భవనంలో ఆయన వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. అనంతరం చైర్మన్ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు .
భక్తుల సౌకర్యార్థం తిరుపతిలోని 9 ప్రాంతాల్లో దాదాపు 92 కౌంటర్ల ద్వారా సర్వదర్శనం టోకెన్లు జారీ చేయడం జరుగుతుందని
జనవరి 2 నుండి 11వ తేదీ వరకు 10 రోజులకు గాను జనవరి 1వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రారంభిస్తామని 10 రోజుల కోటా పూర్తయ్యేంత వరకు నిరంతరాయంగా 4 లక్షల 50 వేల టోకెన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశామని భక్తులకు త్వరిత గతిన దర్శనం చేయడం కోసం చేసిన ఈ ఏర్పాట్లను గమనించి భక్తులు టోకెన్ తీసుకున్నాకే తిరుమలకు రావాలని చైర్మన్ విజ్ఞప్తి చేశారు.

తిరుపతిలో భూదేవి కాంప్లెక్స్‌, ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, జీవకోన జడ్పీ హైస్కూల్‌, విష్ణునివాసం, శ్రీనివాసం, బైరాగిపట్టెడలోని రామానాయుడు పాఠశాల(మహాత్మాగాంధీ మున్సిపల్‌ హైస్కూల్‌), ఎమ్‌.ఆర్‌ పల్లి పోలీస్‌ స్టేషన్‌ వెనుక వైపున గల శేషాద్రి నగర్‌లోని జెడ్‌పి హైస్కూల్‌, గోవిందరాజ స్వామి సత్రాల వద్ద టోకెన్లు జారీ చేస్తామని,జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ సహకారంతో ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. టోకెన్‌ కేంద్రాల వద్ద భక్తుల కొరకు అన్నప్రసాదాలు, మంచినీరు, పాలు, టి, కాఫీ అందిస్తామనీ తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తామని,తిరుమల స్థానికుల కోసం కౌస్తుభం విశ్రాంతి గృహంలో కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఉచిత టోకెన్లు పొందిన భక్తులు తిరుమలలోని కృష్ణతేజ విశ్రాంతి గృహం వద్ద రిపోర్టు చేయాలని,తిరుపతిలో 9 ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన సర్వదర్శనం కౌంటర్లకు సులువుగా వెళ్లేందుకు వీలుగా ఆయా కౌంటర్ల వద్ద క్యూఆర్‌ కోడ్‌ ఏర్పాటు చేశామని భక్తులు సెల్‌ఫోన్‌ ద్వారా స్కాన్‌ చేసి గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారా ఇతర ప్రాంతాల్లోని కౌంటర్లను గుర్తించవచ్చని వెల్లడించారు.
భక్తులకు సమాచారం ఇచ్చేందుకు గాను చెర్లోపల్లి జంక్షన్‌, తిరుచానూరు వద్ద పూడి రోడ్డు, నవజీవన్‌ ఆసుపత్రి వెనుక హైవే వద్ద తగినంత మంది సిబ్బందిని ఏర్పాటు చేస్తామని ఈ ప్రాంతాల్లో కూడా సమీపంలోని సర్వదర్శనం కౌంటర్ల క్యూఆర్‌ కోడ్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు.జనవరి 1, 2 నుండి 11వ తేదీ వరకు కలిపి 300 రూపాయలు టికెట్లు మొత్తం 2.05 లక్షల టికెట్లు విడుదల చేశామని,శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లు జనవరి 2 నుండి 11వ తేదీ వరకు రోజుకు 2 వేలు చొప్పున దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేశామని వీరికి కూడా మహాలఘు దర్శనం ఉంటుందని పేర్కొన్నారు.


భక్తులు టిటిడి వెబ్‌సైట్‌, ఎస్వీబీసీ ఇతర మాధ్యమాల ద్వారా టికెట్ల లభ్యతను ముందే తెలుసుకుని తమ తిరుమల ప్రయాణాన్ని ఖరారు చేసుకోవాల్సిందిగా మనవి చేశారు. భక్తులు కిలోమీటర్ల పొడవున క్యూలైన్లలో ముందుగానే వచ్చి నిరీక్షించకుండా టోకెన్‌పై తమకు కేటాయించిన ప్రాంతానికి నిర్దేశించిన సమయానికి మాత్రమే రావాలని విజ్ఞప్తి చేశారు.నూతన సంవత్సరం, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి దృష్ట్యా డిసెంబర్‌ 29 నుండి జనవరి 3 వరకు వసతి అడ్వాన్స్‌ బుకింగ్‌ రద్దు చేశామని తిరుమలలో వసతి గృహాలు పరిమితంగా ఉన్న కారణంగా భక్తులు తాము పొందిన టికెట్లు లేదా టోకెన్లపై సూచించిన తేదీ మరియు సమయానికి మాత్రమే తిరుమలకు దర్శనానికి రావాల్సిందిగా కోరారు.సామాన్య భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని జనవరి 1న, వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 2 నుండి 11వ తేదీ వరకు స్వయంగా వచ్చే రాజ్యాంగబద్దమైన పదవుల్లో ఉన్న ప్రముఖులకు మాత్రమే విఐపి బ్రేక్‌ దర్శనం కల్పించడం జరుగుతుందని ఒక విఐపికి రెండు గదులు మాత్రమే కేటాయిస్తామని, జనవరి 2 మరియు 3 వ తేదీల్లో ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని, ఆ తరువాత రద్దీని బట్టి నిర్ణయం తీసుకుంటామని,భక్తుల సౌకర్యార్థం రెండు ఘాట్‌ రోడ్లు 24 గంటల పాటు తెరిచి ఉంచబడతాయని తెలిపారు.


తిరుమలలో పోలీసులతో సమన్వయం చేసుకుని ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్ల చేస్తున్నారని,తిరుమలలో దాదాపు 8 వేల వాహనాలకు సరిపడా పార్కింగ్‌ ఏర్పాట్లు చేయడమైనదని వెల్లడించారు. కోవిడ్ మళ్ళీ వ్యాపిస్తున్న పరిస్థితులు నెలకొన్నందువల్ల కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ మార్గ దర్శకాలు జారీ చేశాయని భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉన్నందువల్ల అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులందరూ తప్పని సరిగా మాస్క్ ధరించి రావాలని విజ్ఞప్తి చేసారు.