భర్త చనిపోయినా భరణం ఇవ్వాల్సిందే: హైకోర్టు
హిందూ వివాహ చట్టాల మేరకు భార్యను పోషించాల్సిన చట్టపరమైన బాధ్యత భర్త మరణంతో ముగిసిపోదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. వితంతువు అయిన మహిళ.. మరణించిన భర్త ఆస్తి నుంచి భరణం కోరవచ్చని తెలిపింది. అవసరమైతే మామ నుంచి కూడా భరణం కోరవచ్చని హైకోర్టు పేర్కొంది. రామ్‌పూర్ ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వును సవాల్ చేస్తూ అకుల్ రస్తోగి అనే వ్యక్తి దాఖలు చేసిన అప్పీల్‌ను జస్టిస్ అరిందమ్ సిన్హా, జస్టిస్ సత్యవీర్‌సింగ్‌లతో కూడిన డివిజన్ బెంచ్ కొట్టివేసింది. సదరు మహిళ ఉద్యోగం, ఆస్తుల గురించి కోర్టుకు అబద్ధం చెప్పారని పిటిషనర్ తరపు న్యాయవాది తెలుపగా.. అందుకు ఆధారాల్లేవని కోర్టు తోసిపుచ్చింది. వివాహానంతరం పోషించాల్సిన బాధ్యత ఆమె తండ్రికి ఉండదని స్పష్టం చేసింది. ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులను సమర్థిస్తూ.. పిటిషనర్ భరణం చెల్లించాల్సిందేనని తీర్పునిచ్చింది.

