Andhra PradeshHome Page Slider

పవన్ కల్యాణ్‌పై అలీ, చంద్రబాబుపై పెద్దిరెడ్డి పోటీకి సై…

◆ పొత్తుల నుంచి పోటీల వరకు సై అంటే సై అంటున్న నాయకులు
◆ తాజాగా పవన్ కళ్యాణ్‌పై పోటీకి సిద్ధమన్న సినీ నటుడు అలీ
◆ చంద్రబాబుపై పోటీకి సిద్ధమంటున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
◆ ఏడాదిన్నర ముందే గరం గరంగా రాజకీయాలు
◆ సవాళ్లు ప్రతి సవాళ్లతో వేడెక్కిన ఏపీ రాజకీయం

ఏపీలో సాధారణ ఎన్నికలకు మరో ఏడాదిన్నర గడువు ఉన్నప్పటికీ ప్రధాన పార్టీలు సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం వేడెక్కుతోంది. పొత్తుల నుంచి పోటీల వరకు సై అంటూ సై అని నాయకులు సవాళ్లు విసురుతున్నారు. రెండు రోజుల క్రితం ప్రతిపక్ష నేత చంద్రబాబుపై పోటీకి తాను సిద్ధమని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించడం… తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై పోటీకి సిద్ధమంటూ ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా చైర్మన్ సినీ నటుడు అలీ సవాలు విసరడంతో రాజకీయాలు మాత్రం గరంగరంగా మారాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ నుండి పోటీ చేసినా… తనను పార్టీ ఆదేశిస్తే అక్కడ నుంచి బరిలోకి దిగుతానని మంగళవారం అలీ సంచలన ప్రకటన చేశారు. పవన్ కళ్యాణ్ తాను మిత్రులమేనని అయితే సినిమాల వేరు రాజకీయాలు వేరన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175 సీట్లు గెలిచి తీరుతోందని దీమా వ్యక్తం చేశారు.

అయితే పవన్ కళ్యాణ్, అలీ ఒకప్పుడు మంచి మిత్రులు అన్న విషయం అందరికీ తెలిసిందే. 2019 ఎన్నికల్లో అలీ వైసీపీకి జై కొట్టడంతో సీన్ మారింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అలీకి కీలక పదవి దక్కుతుందని ఆశించారు. మూడున్నర ఏళ్ల తర్వాత ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా చైర్మన్ పదవి ఆయనను వరించింది. అయితే హఠాత్తుగా అలీ పవన్‌పై పోటీకి సై అనడం వెనుక వైసీపీ మార్కు రాజకీయం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల చంద్రబాబును కలిసిన పవన్ కళ్యాణ్ పొత్తులపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో నిర్వహించిన యువశక్తి సభలో పవన్ కళ్యాణ్ డైమండ్ రాణి అంటూ రాష్ట్రమంత్రి రోజాపై తీవ్ర విమర్శలు చేశారు. అదే సభలో జబర్దస్త్ టీం సభ్యులు హైపర్ ఆది కూడా రాష్ట్ర మంత్రులు వైసీపీ నాయకులపై ఘాటు విమర్శలు చేశారు. సోషల్ మీడియాలో ఇవి బాగా వైరల్ అయ్యాయి. హైపర్ ఆది వ్యాఖ్యలను మంత్రి రోజా తేలిగ్గా కొట్టి పారేశారు. జనసేన పెద్దలు ఏం చెబితే వాటిని ఆది మాట్లాడారన్నారు. కానీ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న వైసీపీ అధిష్టానం సినీ గ్లామర్ ఉన్న అలీని అస్త్రంగా ఉపయోగించింది. పవన్ కళ్యాణ్ పరిణితి లేని నాయకుడని విమర్శించిన అలీ పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయారని విమర్శించటంతో పవన్ కళ్యాణ్ స్థాయిని దెబ్బ తీసేలా పార్టీ స్కెచ్ వేసిందన్న అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

అలానే చంద్రబాబు నియోజకవర్గం కుప్పంను వైసీపీ అధిష్టానం సీరియస్‌గా తీసుకోవడంతో ఇంతకు ముందు ఎప్పుడు లేని విధంగా ఆ నియోజకవర్గంలో అభివృద్ధి కోసం కోట్లు ఖర్చుపెట్టి అభివృద్ధిని పరుగులు తీయిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఏడుసార్లు తిరుగులేకుండా గెలిచిన చంద్రబాబుకు సొంత నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎదురైన ఓటమిని అప్పట్లో జీర్ణించుకోలేకపోయారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం వెనుక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక భూమిక పోషించారనేది బహిరంగ రహస్యం. పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో కుప్పం నుంచి భరత్‌ను వచ్చే ఎన్నికల్లో బరిలోకి దింపుతున్నట్లు వైసీపీ అధిష్టానం కొద్ది నెలల క్రితమే ప్రకటించింది. కుప్పం జారిపోకుండా ఉండేందుకు చంద్రబాబు ఆ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. కుప్పం పాలిటెక్స్‌లో వైసీపీ అభ్యర్థి భరత్ చంద్రబాబు కంటే వెనుకబడ్డారని వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబును ఢీకొట్టేందుకు తాను సిద్ధమంటూ పెద్దిరెడ్డి రెండు రోజుల క్రితం సవాలు విసిరారు. చంద్రబాబును ఢీకొట్టే స్థాయిలో అక్కడ ప్రత్యర్థి ఉంటేనే పోరు రసవత్తరంగా మారే అవకాశం ఉంటున్న క్రమంలోనే పెద్దిరెడ్డి తాను పోటీకి సిద్ధం అయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి. గెలుపోవటముల సంగతి పక్కన పెడితే పవన్ కళ్యాణ్ చంద్రబాబుపై పోటీకి సిద్దమంటూ అలీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన సవాళ్లు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. పొత్తులు ఎత్తులు ఓ కొలిక్కి వచ్చాక రాజకీయ పక్షాలు ఎన్నికల బరిలో దిగే అభ్యర్థులను ఖరారు చేస్తాయి. అప్పటివరకు పాలక ప్రతిపక్షాల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు ఇలానే కొనసాగనున్నాయి.