ఎన్నికలకు ముందే కాడి వొదిలేసిన డిప్యూటీ సీఎం
రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో ఊహించడం కష్టం. ఏ క్షణాన ఎలాగైనా టర్న్ అవుతాయ్. పదవుల కోసం నేతలు పడే పాట్లు కొన్నిసార్లు జీవితంలో అంతిమ లక్ష్యాన్ని చేరుకోకుండా కూడా చేస్తాయ్. ప్రస్తుతం మహారాష్ట్రలో రాజకీయాలు అలాంటి టర్న్ అవుతున్నట్టుగా కన్పిస్తున్నాయ్. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ చీలిక తర్వాత బీజేపీ ఆడిన రాజకీయ క్రీడలో జరిగిన మార్పులను చూశాం. అయితే ఇప్పుడు ఎన్సీపీ చీలిక నేత, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి రాజకీయంగా తాను పశ్చాత్తాపం వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కుటుంబానికి కంచుకోట అయిన బారామతిపై చేసిన వ్యాఖ్యలతో మళ్లీ వార్తల్లో నిలిచారు. ఎంపీ నియోజకవర్గం నుంచి బంధువు సుప్రియా సూలే చేతిలో ఓడిపోయిన నెలల తర్వాత, అజిత్ పవార్ ఇప్పుడు తన భార్యను పోటీకి నిలబెట్టడం తప్పు అని అంగీకరించారు. ఈరోజు ఆయన ప్రస్తుతం తనకు పట్టున్న బారామతి అసెంబ్లీ నియోజకవర్గానికి వారసుడిని బరిలో నిలబెడతానన్నారు. 65 ఏళ్ల అజిత్ పవార్, ఈ ఏడాది చివరి నాటికి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయకపోవచ్చునన్నారు. ఏడెనిమిది ఎన్నికల్లో ఇప్పటిదాకా పోటీ చేశానన్నా ఆయన ఎన్నికల్లో పోటీపై ఆసక్తి లేదన్నారు. తన కుమారుడు జై పవార్ ఈ స్థానం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారని, అజిత్ పవార్ చెప్పారు.

“ఇది ప్రజాస్వామ్యం…. ప్రజలు, మద్దతుదారులు ఎలా అనుకుంటే, పార్టీ అలా చర్చిస్తుంది” అని ఆయన అన్నారు. పార్టీ, ప్రజలు జైని ఎన్నికల్లో నిలబెట్టాలని భావిస్తే, అతనిని పోటీకి దింపడానికి సిద్ధమని చెప్పారు. 2019లో, అజిత్ పవార్ పెద్ద కుమారుడు పార్థ్ పవార్ మావల్ నియోజకవర్గంలో శివసేనకు చెందిన శ్రీరంగ్ బర్నే చేతిలో రెండు లక్షలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. కుటుంబ పెద్ద, శరద్ పవార్ నుండి విడిపోయి, పార్టీని చీల్చిన తరువాత, అజిత్ పవార్ వర్గం ఎన్నికల్లో చావు దెబ్బతింది. ఈ ఏడాది ప్రారంభంలో రాష్ట్రంలోని 48 లోక్‌సభ స్థానాల్లో నాలుగింటిలో పోటీ చేసిన ఎన్‌సిపి ఒకదానిని మాత్రమే గెలుచుకోగలిగింది. పార్టీ చీలికపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, శరద్ పవార్ నుంచి పార్టీ సింబల్ లాక్కోవడంపై జనంలో వ్యతిరేకత ఎక్కువైంది. పవార్ భార్య సునేత్రా పవార్ బారామతిలో 1.5 లక్షల ఓట్ల తేడాతో ఆయన బంధువు సుప్రియా సూలే చేతిలో ఓడిపోయారు. మంగళవారం, పవార్ తన సోదరిపై భార్యను పోటీకి నిలబెట్టడం తప్పుని అంగీకరించారు. రాజకీయాలను ఇంట్లోకి రానివ్వకూడదని పవార్ రాష్ట్రవ్యాప్తంగా ‘జన్ సమ్మాన్ యాత్ర’ చేస్తున్నప్పుడు మరాఠీ న్యూస్ ఛానెల్ జైమహారాష్ట్రతో అన్నారు. “నేను నా సోదరీమణులందరినీ ప్రేమిస్తున్నాను. రాజకీయాలను ఇంట్లోకి రానివ్వకూడదు. నా సోదరిపై సునేత్రను పోటీకి దింపడం నేను తప్పు చేశాను. ఇది జరగకూడదు. కానీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు నేను భావిస్తున్నాను. అది తప్పు’ అని అజిత్ పవార్ అన్నారు. అజిత్ పవార్ వ్యాఖ్యలు ఇప్పుడు మహారాష్ట్రలో రచ్చకు కారణమవుతున్నాయి. మొత్తం వ్యవహారంపై మాట్లేందుకు NCP నాయకులు ముందుకు రాకపోవడంతో.. వచ్చే రోజుల్లో ఏదైనా జరగొచ్చన్న భావన ఉంది.

