NewsTelangana

అసలు స్టోరీ చెప్పిన పోలీసులు

ఉదయం ఎనిమిదిన్నర సమయంలో… ఐదుగురు వ్యక్తులు రైల్వే స్టేషన్లోకి ప్రవేశించారు. ముందస్తు వ్యూహంలో భాగంగా రైల్వే స్టేషన్ బయట వున్న బస్సు అద్దాలను
పగలగొట్టారు. తర్వాత వందల సంఖ్యలో ఎడమ వైపు వున్న కార్ పార్కింగ్ ఎంట్రన్స్ నుంచి రైల్వే స్టేషన్లోకి ప్రవేశించారు. ఒక్కసారిగా గుంపులు గుంపులుగా స్టేషన్లోకి
చొరబడ్డారు. రావడం రావడం…. బోగీలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేశారు. ఏసీ బోగీలను తగలబెట్టారు. మూడు గ్రూపులుగా విడిపోయి రైల్వే స్టేషన్ పై దాడికి
తెగబడ్డారు. రైల్వే పోలీసులు ఘటన స్థలంలోకి వచ్చే లోపలే… 1,2,3,4 ప్లాట్ ఫామ్‌లపై విచక్షణ రహితంగా దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఓవైపు మెయిన్ ఎంట్రీ నుంచి ధ్వంసం చేస్తూనే… మరోవైపు బోయగూడ వైపు వున్న 10వ నెంబర్ ప్లాట్ ఫామ్‌లోకి సైతం కొందరు ఎంటరయ్యారు. రెండు వైపుల నుంచి దాడి చేయడంతో రైల్వే స్టేషన్లో భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. ఇప్పటి వరకు రైల్వే అధికారుల అంచనా ప్రకారం 20 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది. ఆందోళనకారులను అడ్డుకోనేందుకు కాల్పులు జరపకుంటే… ఇవాళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మొత్తం తగలబడిపోయేదంటున్నారు పోలీసులు. ప్లాట్ ఫామ్ నెంబర్ 1, 2 మీద డీజల్ ట్యాంకర్లు మూడు ఉన్నాయని… ఒకవేళ ఆందోళన కారులు ఒక్క సారిగా డీజల్ ట్యాంకర్ వైపు చొచ్చుకొచ్చి విధ్వంసం సృష్టిస్తే ఘోరం జరిగిపోయేదని… అందుకే కాల్పులు జరపాల్సి
వచ్చిందని చెబుతున్నారు.