దూకుడు పెంచిన ఈడీ.. 35 చోట్ల సోదాలు
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడు పెంచింది. మంగళవారం ఏకంగా 35 చోట్ల సోదాలు నిర్వహించింది. అయితే.. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీశ్ సిసోడియా ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించలేదు. ముఖ్యమంగా ఢిల్లీ, గురుగ్రామ్, హైదరాబాద్, ముంబై, బెంగళూరుల్లో సోదాలు జరిగాయి. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్ విధానంలో అక్రమాల కేసులో నిందితుడైన సమీర్ మహేంద్రుకు చెందిన ఢిల్లీ నివాసంలో సోదాలు జరిగాయి. ఈ కేసుకు సంబంధించి తొలుత సీబీఐ సోదాలు జరిపిందని.. అప్పుడు ఏమీ దొరకలేదని.. ఇప్పుడు ఈడీ సోదాలు జరుపుతోందని.. అయినా ఏమీ దొరకదని సిసోడియా ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఢిల్లీలో చేస్తున్న అభివృద్ధి పనులను అడ్డుకునేందుకే మోడీ సర్కారు సీబీఐ, ఈడీలను ప్రయోగిస్తోందని ఆరోపించారు.