NationalNews

మూడున్నర నెలల తర్వాత ఎట్టకేలకు బెయిల్‌

శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌కు భారీ ఊరట లభించింది. మనీల్యాండరింగ్‌ కేసులో అరెస్టయి మూడు నెలలుగా జైల్లో ఉన్న సంజయ్‌ రౌత్‌కు ప్రత్యేక న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. బెయిలు దరఖాస్తుపై రౌత్‌, ఈడీ తరఫు న్యాయవాదుల వాదనలు విన్న ప్రత్యేక కోర్టు అక్టోబర్‌ 21న తీర్పు రిజర్వ్‌ చేసింది. ఈ క్రమంలో సంజయ్‌ రౌత్‌ 100 రోజుల పాటు జైలు జీవితం గడిపారు. మనీల్యాండరింగ్‌ కేసులో సంజయ్‌ రౌత్‌ను గత ఆగస్టు 1న ఈడీ కస్టడీలోకి తీసుకుంది. మనీలాండరింగ్‌ చట్టం కింద అరెస్ట్‌ కావడానికి ముందు ఆయన రెండుసార్లు ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు.

రాజకీయ కక్షతోనే తనపై తప్పుడు కేసు బనాయించినట్టు రౌత్‌ మొదటు నుంచి చెప్పారు. ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టి బీజేపీతో ఏక్‌నాథ్‌ షిండే వర్గం జతకట్టడాన్ని సంజయ్‌ రౌత్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. రాజకీయ కక్షలతోనే తనపై తప్పుడు కేసు పెట్టారని సంజయ్‌ రౌత్‌ ఆరోపించారు. అయితే.. సంజయ్‌ రౌత్‌ ఆరోపణలను ఈడీ తిరస్కరించింది. మనీలాండరింగ్‌ నేరంలో రౌత్‌ ప్రమేయం ఉన్నట్లు తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని పేర్కొంది.