NewsTelangana

ఎన్నికలు తర్వాత.. ఆస్తులను కాపాడుకోవడమెలా..

రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని.. ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని మంత్రులకు, ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్‌ చేసిన సూచన కార్యరూపం దాల్చడం లేదు. ఐటీ, ఈడీ, సీబీఐ దాడులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఎప్పుడు ఎవరు తమపై దాడి చేస్తారో అనే భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ప్రధాని మోదీకి, సీఎం కేసీఆర్‌కు మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో తాము బలి పశువు అవుతున్నామన్న భయం వారిని వెంటాడుతోంది. ఆర్థికంగా బలంగా ఉన్న టీఆర్‌ఎస్‌ నాయకులకు మాత్రం కంటి మీద కునుకు లేకుండా ఉంది. ఎన్నికలు తర్వాత.. ముందు తమ ఆస్తులు కాపాడుకోవడం ఎలా.. అని ఆలోచిస్తున్నారు.

విఫలమైన కేసీఆర్‌ స్కెచ్‌..

టీఆర్‌ఎస్‌ నాయకుల మైండ్‌ను ఎన్నికల నుంచి సొంత ఆస్తులను కాపాడుకోవడం వైపు డైవర్ట్‌ చేయడంలో సక్సెస్‌ అయ్యామని బీజేపీ నాయకులు హ్యాపీగా ఉన్నారు. బీజేపీని ఇబ్బందులకు గురి చేయాలన్న టీఆర్‌ఎస్‌ వ్యూహం విఫలమైందని.. ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో బీజేపీ నాయకులను ఇరికించేందుకు సీఎం కేసీఆర్‌ వేసిన స్కెచ్‌ ఫలించలేదని.. ఈ కేసు సాకుతో బీజేపీ సీనియర్‌ నాయకులను అరెస్టు చేయాలన్న సిట్‌ అధికారులకు ఎదురు దెబ్బ తగిలిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.