ఆ మూడు పదవులు ఇచ్చాక… కాంగ్రెస్ పార్టీ ఖతం.
రాష్ట్ర క్యాబినెట్‌లో మిగిలిన మూడు ఖాళీలను నింపిన తర్వాతే కాంగ్రెస్‌లోని అంతర్గత కలహాలు బయటపడతాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నంది రాంచందర్‌రావు హెచ్చరించారు. ప్రస్తుతం పదవుల ఆశలో నేతలు నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ, క్యాబినెట్ విస్తరణ అనంతరం పార్టీలో గందరగోళం తప్పదని చెప్పారు. ఇటీవల మూడు మంత్రిపదవుల నియామక సమయంలోనే పార్టీలో ఎంత కలత చోటుచేసుకుందో ప్రజలందరికీ తెలుసని తెలిపారు.బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ నేతృత్వం తమ నేతలను ఆశలలో ఉంచి ఊరిస్తోందని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీజేపీకి సవాల్‌గా మారిందని, కానీ గత ఎన్నికల్లో 25 వేల ఓట్లు సాధించిన అనుభవంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. రాష్ట్ర బీజేపీ కొత్త కమిటీని 20 రోజుల్లో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఇదిలా ఉండగా, ముస్లింలకు దేశవ్యాప్తంగా స్పష్టమైన నాయకత్వం లేకపోవడాన్ని గుర్తించిన అసదుద్దీన్ ఒవైసీ, ముస్లింలకు నాయకత్వం వహించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. పాతబస్తీలో సల్కం చెరువు భూమిపై నిర్మించిన అక్బరుద్దీన్ కళాశాలను ఇప్పటికీ కూల్చకుండా ఉండడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘ప్రభుత్వ భూములను ఆక్రమించినా, కరెంట్ బిల్లులు చెల్లించకపోయినా, అక్రమాలెన్నీ చేసినా, కొందరికి రక్షణ కల్పించడమేనా ప్రభుత్వ విధానం? తక్షణమే అక్బరుద్దీన్ కాలేజీని కూల్చాలి. లేకపోతే బీజేపీ తామే ఆ పని చేస్తుంది’’ అంటూ ఆయన హెచ్చరించారు.