తెలంగాణలో అడ్వాంటేజ్ బీజేపీ? ఎందుకు? ఏమిటి? ఎలా?
తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు సరికొత్త పుంతలు తొక్కుతున్నాయి. క్లీన్ ఇమేజ్‌తో బీజేపీ ఇప్పుడు తెలంగాణ గడ్డపై పోరాడేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే 45 మంది అభ్యర్థుల జాబితాతో రేపో మాపో అభ్యర్థుల ప్రకటనకు సిద్ధమవుతున్న కాషాయదళం వచ్చే రోజుల్లో మరింత కసరత్తు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణలో బీజేపీ ఇప్పటివరకు అధికారంలోకి రాలేదు. అంతేకాదు తెలంగాణలో చాలా నియోజకవర్గాల్లో బలంగా ఉన్న బీజేపీ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో కార్యకర్తల బేస్ కలిగి ఉంది. అయితే వాటిలో ఒక యాభై నియోజకవర్గాల్లో బీజేపీకి గెలిచే స్థాయిలో నాయకులున్నారు. వారందరూ కూడా వచ్చే ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసి ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుకుంటున్నారు. వారందరూ ప్రజల్లో చైతన్యం కలిగించి.. బీజేపీకే ఎందుకు ఓటేయాలి అన్న కాన్సెప్ట్‌ను జనంలోకి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. ఆలోచన రేకెత్తించేలా వ్యూహాలు పన్నుతున్నారు.

ముఖ్యంగా బీజేపీ తెలంగాణలో ఇప్పటివరకు అధికారాన్ని చేపట్టలేదు. దీంతో ప్రజల్లో ఎలాంటి నెగిటివ్ షేడ్స్ లేవు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నందున తెలంగాణలో ప్రజలకు ఏదైనా చేయాలంటే అది తమతోనే సాధ్యమని… కమలం పార్టీ నేతలు ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణలో ఇప్పటివరకు అధికారాన్ని అనుభవించకపోవడం వల్ల ఆ పార్టీపై మిగతా పార్టీల పట్ల ఉన్న వ్యతిరేకత లేదు. ఇక్కడో విషయాన్ని క్లియర్‌గా చెప్పాలి. కాంగ్రెస్ గానీ, టీఆర్ఎస్ గానీ, తెలంగాణలో సుదీర్ఘకాలం రాజకీయాలు చేశాయి. తెలంగాణ రాక మునుపు కూడా గులాబీ పార్టీ ప్రతిపక్షంలో కూర్చుంది. అయితే బీజేపీ నేటి వరకు తెలంగాణలో అధికారంలో భాగస్వామిగా లేదు. సీట్లు, ఓట్లు తెచ్చుకున్నప్పటికీ ప్రతిపక్షానికే ఆ పార్టీ పరిమితమవుతూ వచ్చింది. అయితే మోడీ జమానాలో తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని బీజేపీ భావిస్తోంది. అందుకు తగిన నేపథ్యాన్ని కూడా పార్టీ నేతలు రూపొందించారు. తెలంగాణ ప్రజలకు కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు రావాలంటే అది కేవలం బీజేపీకి ఓటు ద్వారానే సాధ్యమవుతుందన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు వచ్చే కొద్ది రోజుల్లో నిధులు లేమితో చేతులెత్తేయాల్సిన దుస్థితి వస్తుందని, ఉద్యోగులకు జీతాలివ్వలేకపోతున్నారని, పింఛన్లను సమయానికి అందించలేకపోతున్నారన్న విమర్శల నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం-రాష్ట్ర ప్రభుత్వం ఒకటే ఉంటే అది ప్రజలకు మేలు చేస్తోందన్న వర్షన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని స్థానిక బీజేపీ నేతలు చూస్తున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నందున రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తే పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు మేలు జరుగుతుందన్న భావన వ్యక్తం చేస్తున్నారు. అందుకే బీజేపీ అగ్రనాయకత్వం తెలంగాణపై ఇప్పుడు ఫోకస్ పెంచింది. గతంలో తెలంగాణ విషయంలో దాటవేత వైఖరిని ఇప్పుడు పక్కనబెట్టింది. తెలంగాణ బీజేపీ పట్టు నిలబెట్టుకోవాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తోంది. పార్టీ చీఫ్‌గా ఉన్న సంజయ్‌ని తొలగించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పార్టీ పగ్గాలు అప్పజెప్పించిన నాయకత్వం, బీజేపీ ఎన్నికల కమిటీ ఛైర్మన్‌గా ఈటల రాజేందర్‌ను నియమించింది. ఇద్దరు నేతలు కలిసి పార్టీని జోడెద్దుల్లా ముందుకు తీసుకెళ్లాలని అధినాయకత్వం భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో మెజార్టీ సీట్లను గెలుచుకునేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్న భావనను కలిగిస్తోంది. పార్టీని విజయతీరాలకు చేర్చేందుకు సేఫ్ సీట్స్, గెలవగల సత్తా ఉన్న సీట్ల ఫోకస్ పెంచుతోంది.