Andhra PradeshHome Page Slider

అంగరంగ వైభవంగా ‘ఆదిపురుష్’ ప్రీరిలీజ్ ఫంక్షన్

కలియుగ వైకుంఠం తిరుపతిలో రెబల్ స్టార్ ప్రభాస్, శ్రీరామునిగా నటించిన ఆదిపురుష్ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ అంగరంగ వైభవంగా భారీ ఎత్తున జరిగింది. ఈ కార్యక్రమానికి దాదాపు లక్షమంది హాజరయ్యారు. ఆధ్యాత్మిక గురువు చిన్న జియ్యర్ స్వామి వారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీరామచంద్రుని ప్రాశస్త్యాన్ని, తిరుమల గొప్పతనాన్ని వివరించారు. రామాయణ మహాకావ్యాన్ని దృశ్యరూపం చేసిన ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని కోరుకుంటూ మంగళాశాసనాలు అందించారు.

అనంతరం హీరో ప్రభాస్ మాట్లాడుతూ, ఈ చిత్ర యూనిట్ అంతా ఎంతో భక్తిభావనతో ఈ చిత్రానికి పనిచేశారని, ఒక తపస్సులా షూటింగ్‌ను పూర్తి చేశారన్నారు. రామాయణాన్ని సినిమాగా రూపొందించిన ఈ చిత్రంలో పురుషోత్తముడైన శ్రీరాముని పాత్రను ధరించడం తన పూర్వజన్మ సుకృతం అన్నారు. సీత పాత్ర ధరించిన కృతి సనన్ చాలా చక్కగా సూట్ అయ్యిందని, లక్ష్మణ, ఆంజనేయ పాత్రధారులు తమ పాత్రలకు న్యాయం చేశారన్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా రామాయణాన్ని తీసే అదృష్టం ఎవరికో గానీ, లభించదన్నారని, తనను అభినందించారని ఈ సందర్భంగా తెలియజేశారు. అభిమానులు తనపై చూపించే ప్రేమాభిమానాలకు రుణపడి ఉంటానని, ఇకపై ఏడాదికి రెండు, మూడు సినిమాలు చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. తాను వివాహం త్వరలోనే తిరుపతిలోనే చేసుకుంటానని, ప్రేక్షకుల ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ సందర్భంగా మరొక యాక్షన్ ట్రైలర్‌ను కూడా విడుదల చేసింది చిత్రబృందం. ఈనెల 16న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ చిత్రం.