తిరుమలలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా… వారం తర్వాతే భవిష్యత్‌పై నిర్ణయం
ప్రాణం పోయే వరకు ఉన్నది ఉన్నట్టే మాట్లాడతానన్నారు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు. వ్యక్తిగతంగా, తాను ఎవరినీ ఇబ్బంది పెట్టలేదన్న మైనంపల్లి, తన జోలికి వస్తే చూస్తూ ఊర్కోనన్నారు. రాజకీయ భవిష్యత్ నిర్ణయించాల్సింది ప్రజలేనన్నారు. రేపట్నుంచి వారం రోజుల పాటు మల్కాజ్‌గిరిలో తిరుగుతానన్నారు. ప్రజలతో అన్ని విషయాలు మాట్లాడాక మీడియా ముందుకు వచ్చి భవిష్యత్ కార్యాచరణ వివరిస్తానన్నారు. పార్టీ ఇప్పటి వరకు తనను ఏమీ అనలేదని, తాను కూడా పార్టీని అనబోనన్న మైనంపల్లి తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్నారు. మెదక్ ప్రజలు తనకు రాజకీయ భిక్ష పెట్టారన్నారు. తనకు జిల్లాలో బ్రహ్మాండమైన కేడర్ ఉందన్నారు. మూడు పార్టీల్లోనూ తనకు మిత్రులున్నారన్నారు. తాను ఏ పార్టీని తిట్టలేదన్నారు. కేవలం కొందరు వ్యక్తులతోనే ఇబ్బంది అని స్పష్టం చేశారు. కొన ఊపిరి వరకు ఉన్నంత వరకు స్ట్రెయిట్ ఫార్వార్డ్ గానే ఉంటారన్నారు. మల్కాజ్ గిరి కార్యకర్తలు, మెదక్ కార్యకర్తలు కన్ఫ్యూజన్‌లో ఉన్నారన్నారు. మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అణిచివేస్తున్నారన్నారు. ప్రాణాలు లెక్క చేయకుండా మెదక్ వాసులకు కరోనా సమయంలో 8 కోట్ల రూపాయల సేవలందించారన్నారు. మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, తన అనుచరులను పోలీసులు వేధిస్తున్నారన్నారు. మెదక్ ప్రజలు ఏం చెప్తే అదే తన బిడ్డ చేస్తాడన్నారు.
