NewsTelangana

ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డికి అదనపు భద్రత

‘టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు ఎర’ ఆపరేషన్‌లో కీలక వ్యక్తి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి భద్రతను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. రోహిత్‌కే చెందిన మొయినాబాద్‌ ఫాంహౌస్‌ కేసు విచారణ జరుగుతున్నందున ఆయనపై ప్రత్యర్థులు దాడికి పాల్పడే ప్రమాదం ఉందన్న వార్తల నేపథ్యంలో బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం, 4 ప్లస్‌ 4 గన్‌మెన్లను కేటాయిస్తూ రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఆయనకు 2 ప్లస్‌ 2 భద్రత ఉండేది. శుక్రవారం విడుదలైన రెండు ఫోన్‌కాల్‌ రికార్డింగుల్లో రోహిత్‌ రెడ్డి జరిపిన సంభాషణలే కీలకంగా మారాయి. ఈ ఆడియోలు నిజమైనవా..? కల్పితమా..? అనే విషయంపై పోలీసులు ఇప్పటి వరకూ నోరు విప్పలేదు.

బీజేపీ కీలక నేతల పేర్లు ..

నలుగురు ఎమ్మెల్యేలను ట్రాప్‌లో పడేయాలని బీజేపీ నేతలు భావిస్తే.. టీఆర్ఎస్‌ పన్నిన వలలోనే బీజేపీ వాళ్లు పడిపోయారనే టాక్‌ వినిపిస్తోంది. రోహిత్‌ రెడ్డితో మాట్లాడిన ఫోన్‌ కాల్‌ రికార్డింగుల్లో బీజేపీ కీలక నేతల పేర్లు బయటికొచ్చాయి. దీంతో ఈ కేసులో కీలకంగా మారిన రోహిత్‌కు ప్రమాదం పొంచి ఉందని.. అందుకే భద్రతను పెంచామని తెలంగాణ పోలీసులు వివరణ ఇచ్చారు. ఈ కేసును ఇంతటితో వదిలి పెట్టొద్దని తెలంగాణ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. కేసు కీలక మలుపులు తిరుగుతున్నందున చివరికి ఎలా ముగుస్తుందోనని అందరూ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.