కేరళకు అదానీ భారీ విరాళం
కేరళలోని వయనాడ్ ప్రకృతి విపత్తు ఘటన వందలాది కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. కాగా ఈ దుర్ఘటనలో 163 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో కేరళ సీఎం సహాయ నిధికి దేశవ్యాప్తంగా విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు తమిళనాడు సీఎం స్టాలిన్ ఇప్పటికే కేరళకు రూ.5కోట్ల ఆర్థిక సాయం అందించారు. ఈ నేపథ్యంలో ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ కూడా కేరళ సీఎం సహాయ నిధికి రూ.5కోట్ల విరాళం ప్రకటించారు. కాగా వయనాడ్‌లో కొండచరియలు విరిగి ఘోరమైన ప్రాణనష్టం వాటిల్లడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. అయితే ఇటువంటి కష్టకాలంలో అదానీ గ్రూప్ కేరళకు అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.