అదానీ-మోదీ సంబంధాలపై రాహుల్ తీవ్ర ఆరోపణలు
ప్రధాని నరేంద్రమోదీపైనా, గౌతమ్ అదానీపైనా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదానీ కంపెనీలు, స్టాక్ మార్కెట్ మానిప్యులేషన్ ద్వారా కోట్లకు పగడలెత్తాయని రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో విరుచుకుపడ్డారు. అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ నివేదక తర్వాత ప్రభుత్వ వ్యవహరిస్తున్న తీరుపై దారుణంగా ఉందన్నారు. గౌతమ్ అదానీ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడం వెనుక ప్రధాని మోదీ సహకరించారని రాహుల్ విరుచుకుపడ్డారు. అయితే రాహుల్ గాంధీ ఆరోపణలు సత్యదూరమని బీజేపీ మండిపడింది. అదానీ ఇప్పటి వరకు ప్రారంభించిన ఏ రంగంలోనూ సోలార్ ఎనర్జీ నుంచి విండ్ ఎనర్జీ వరకు ఎందులోనూ విఫలం కాలేదని… అదానీకి ఇంతటి విజయం ఎలా సాధ్యమని అనేక మంది తనను పాదయాత్ర సందర్భంగా అడిగారని రాహుల్ చెప్పుకొచ్చారు. ప్రధాని నరేంద్రమోదీతో, అదానీకి ఉన్న సంబంధమేంటని అడిగారన్నారు. ప్రధాని మోదీ పర్యటించిన ప్రతి దేశంలోనూ అదానీకి కాంట్రాక్టులు వస్తున్నాయని రాహుల్ పార్లమెంట్‌లో చెప్పారు. 2014 నుంచి 2022 నాటికి 8 బిలియన్లగా ఉన్న అదానీ ఆస్తుల విలువ… ప్రస్తుతం 140 బిలియన్లకు ఎలా పెరిగిందని రాహుల్ ప్రశ్నించారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు అదానీ ర్యాంకు 600 ఉండేదన్నారు. అదానీ కంపెనీ… ఎయిర్‌పోర్ట్ కాంట్రాక్టులు దక్కించుకోవడం కోసం నిబంధనలన్నింటినీ మార్చేశారన్నారు రాహుల్.
రాహుల్ ఆరోపణలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజ్జు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీపైనా, గ్రూపుపైనా చేసే విమర్శలకు సాక్ష్యాలు కావాలన్నారు. కేవలం విమర్శలతో ఒరిగేదేం లేదన్నారు. మీరు సీనియర్ ఎంపీగా ఉన్నారని… బాధ్యతతో మాట్లాడాలన్నారు. బయట వ్యక్తులు చెప్పిన విషయాలు కాకుండా… పార్లమెంట్‌లో సీరియస్ డిబేట్ చేయాలని కోరుకుంటున్నట్టు మంత్రి చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి ఉన్నప్పుడే ప్రైవేటీకరణ మొదలైందని బీజేపీ ఎంపీలు నినాదాలు చేశారు. జీవీకే లాంటి సంస్థలకు ఎలాంటి అనుభవం లేకున్పటికీ కాంట్రాక్టులు ఇచ్చారని ఆరోపించారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్-అదానీ మధ్య సంబంధాలపైనా రాహుల్ గాంధీ మాట్లాడాలని బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. గత ఏడాది రాజస్థాన్‌లో 65 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతానంటూ అదానీ వాగ్దానం చేశారని బీజేపీ ఎంపీలు గుర్తు చేశారు. హిండెన్ బర్గ్ రిపోర్ట్ తప్పుడు ఆరోపణలు చేసిందని… ఈ ఆరోపణలను దేశంలోని కోర్టులు కూడా తరిస్కరించాయని… నిరాధారమైన ఆరోపణలతో కంపెనీని దెబ్బకొట్టాలని చూస్తున్నారని అదానీ గ్రూప్ ఇప్పటికే ఆరోపించింది. ప్రభుత్వ రంగ సంస్థలైన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెట్టుబడులు అదానీ గ్రూపులో ఉన్నాయని.. దీని వల్ల గ్రూప్ షేర్లలో కరిగిపోవడంలో ప్రజల సొమ్ము ప్రమాదంలో పడిందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. హిండెన్‌బర్గ్-అదానీ గొడవకు సంబంధించిన నిరసనల కారణంగా పార్లమెంటు ఉభయ సభలు పదే పదే అంతరాయం కలిగుతోంది.


 
							 
							