NationalNews

రాజస్థాన్‌లో అదానీ పెట్టుబడులు, రాహుల్‌కు బీజేపీ కౌంటర్

గత కొద్ది రోజులుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇద్దరుముగ్గురు పారిశ్రామికవేత్తలకు దోచిపెడుతోందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చింది బీజేపీ. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల అదానీ, అంబానీలు వేల కోట్లు రుణాలను మాఫీ చేయించుకుంటున్నారని, రైతులు, సామాన్యులు మాత్రం వడ్డీలు చెల్లించి పేదలుగా మారిపోతున్నారంటూ రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలకు బీజేపీ సోషల్ మీడియా గట్టి కౌంటర్ ఇచ్చింది. కాంగ్రెస్ పాలిత రాజస్థాన్‌లో పారిశ్రామికవేత్త అదానీ 65 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నారని.. దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించింది. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌తో వేదికను పంచుకున్న ఫోటోను షేర్ చేసి… సమాధానం చెప్పాలంది.

“ఇన్వెస్ట్ రాజస్థాన్ 2022 సమ్మిట్” లో పాల్గొన్న గౌతం అదానీ… 65 వేల కోట్ల పెట్టుబడులను ప్రకటించారు. 10,000 మెగావాట్ల సౌర విద్యుత్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడంతోపాటు, సిమెంట్ ప్లాంట్‌ను విస్తరించడం, జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని వచ్చే ఐదేళ్లలో విస్తరణ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టనున్నట్టు చెప్పారు. తాజా పెట్టుబడులతో రాష్ట్రంలో 40 వేల మందికి ప్రత్యక్షంగా అనేక వేల మందికి పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి మరో రెండు ప్రాజెక్టులను ప్రారంభించబోతున్నట్టు తెలిపారు. ఎలాంటి సౌకర్యాలు లేని జిల్లాల్లో రెండు మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామని, ఉదయ్‌పూర్‌లో క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా రాజస్థాన్‌లో పెట్టుబడులు పెడుతున్న అదానీకి ఆకాశానికెత్తాడు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. అదానీని “గౌతమ్ భాయ్” అంటూ పిలవడమే కాకుండా… వ్యాపారరంగంలో దూసుకుపోతున్నారంటూ ప్రశంసించారు. గుజరాత్ ఇప్పుడు ధీరూభాయ్ అంబానీ, గౌతమ్ భాయ్ వంటి గొప్ప పారిశ్రామికవేత్తలను, వ్యాపారవేత్తలను తయారు చేసిందని కొనియాడారు. ఇప్పటి వరకు అదానీ, అంబానీలపై తీవ్ర విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఈ సందర్భంగా బీజేపీ గట్టి కౌంటర్ ఇచ్చింది. అదానీ, గెహ్లాట్‌ల ఫోటోలు జోడించి… దీనికేం సమాధానం చెబుతారని ప్రశ్నించింది. పెట్టుబడులు వస్తున్నాయంటే శత్రువులు కూడా మిత్రలైపోతారా అంటూ ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్‌ పూనియా. గాంధీలకు వ్యతిరేకంగా తిరుగుబాటు అసంతృప్తిని రేకెత్తించే మరో సంకేతంగా, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ పెట్టుబడిదారుల సదస్సుకు గౌతమ్ అదానీని ఆహ్వానించారంటూ విమర్శలు గుప్పిస్తోంది. సీఎం పక్కనే అదానీ కూర్చోవడం కూడా రాహుల్ కు చురకలంటించడమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోందని… బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ట్వీట్ చేశారు.

రాజస్థాన్ పెట్టుబడుల సదస్సుకు కొద్దిసేపటి ముందు రాహుల్ గాంధీ… కార్పొరేట్లకు కేంద్రం కొమ్ముకాస్తోందంటూ ఘాటుగా ట్వీట్ చేశారు. కేంద్రం అనేక కోట్ల రూపాయల రుణాలను పెట్టుబడిదారీ స్నేహితుల మొత్తాలను ఎగదోస్తోందని, మరికొందరు కష్టాలను ఎదుర్కొంటున్నారని దుయ్యబట్టారు. ఒకే దేశంలో రెండు భారతదేశాలు.. ఈ విభజనను అంగీకరించబోమని ట్వీట్ చేశారు. ఐతే తాను కార్పొరేట్లకు వ్యతిరేకం కాదని, ఒకరిద్దరి చేతిలో మొత్తం వ్యాపారం కేంద్రీకృతం కావడాన్ని వ్యతిరేకిస్తున్నానన్నారు. వ్యాపారాల్లో ఇద్దరు ముగ్గురు మాత్రమే గుత్తాధిపత్యంగా మార్చడాన్ని వ్యతిరేకిస్తున్నానని రాహుల్ పేర్కొన్నారు. అదే సమయంలో రాజస్థాన్ ప్రభుత్వం గౌతమ్ అదానీకి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వదని… రాష్ట్రానికి మేలు కలిగే ప్రతిపాదనలను ఏ ముఖ్యమంత్రి తిరస్కరించలేరని… అదానీకి తప్పుగా వ్యాపారం చేస్తే దానిని కూడా వ్యతిరేకిస్తానన్నారు.

అదానీతోపాటు, రాష్ట్రంలో వస్తున్న పెట్టుబడులన్నీ చట్టబద్ధంగా జరుగుతున్నాయని… ఎవరికీ ఎలాంటి రాయితీలు ఇవ్వడం లేదని చెప్పారు రాజస్థాన్ మంత్రి ప్రతాప్ సింగ్. పేదలు, రైతులు నిరాశలో ఉండగా, కేంద్ర ప్రభుత్వం మాత్రం బడా వ్యాపారులకు అనుకూలమైన విధానాలు అవలంబిస్తున్నదని మాత్రమే రాహుల్ అన్నారని పేర్కొన్నారు. విమర్శలపై స్పందించారు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్… బీజేపీ ఎందుకు రాజస్థాన్ పెట్టుబడుల సదస్సును వ్యతిరేకిస్తుందో అర్థం కాలేదన్నారు. అశోక్ గెహ్లాట్‌ను వ్యతిరేకించడమంటే… రాజస్థాన్ ఉజ్వల భవిష్యత్తును వ్యతిరేకిస్తున్నట్టని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారందరినీ రాజస్థాన్‌కు స్వాగతిస్తామని చెప్పారు. గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ లేదా అమిత్ షా కుమారుడు జై షా అయినా, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పెట్టుబడులు పెడతామంటే స్వాగతిస్తామని గెహ్లాట్ అన్నారు.