‘అంబేడ్కర్ ఆశయాలను సాధించడమే ఆయనకు నివాళి’ -ప్రకాశ్ అంబేడ్కర్
అంబేడ్కర్ ఆశయాలను సాధించడమే ఆయనకు ఘనమైన నివాళి అన్నారు ప్రకాశ్ అంబేద్కర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో 125 అడుగుల ఘనమైన అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన మనుమడు ప్రకాశ్ అంబేడ్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హుస్సేన్ సాగర్ తీరంలో తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ఆయన అంబేడ్కర్ స్మృతి వనాన్ని ప్రారంభించారు. హైదరాబాద్ అంటే అంబేడ్కర్‌కు ఎంతో ఇష్టమని, దేశానికి రెండవరాజధానిగా హైదరాబాద్ ఉండాలని ఆనాడే అంబేడ్కర్ చెప్పారని వెల్లడించారు. రాష్ట్రాల పునర్విభజన కోసం ఆయన సలహాలు ఇచ్చారని గుర్తుచేశారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడడానికి అంబేడ్కర్ రాజ్యాంగంలో ఇచ్చిన వెసులుబాటే కారణమన్నారు. అంబేడ్కర్ విశ్వమానవుడని కొనియాడారు. కేసీఆర్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణతో కొత్తశకానికి నాందిపలికారన్నారు. చిన్నరాష్ట్రాలతోనే అభివృద్ది త్వరగా జరుగుతుందని ఆయన చెప్పేవారన్నారు. కేసీఆర్ దళితబంధు పథకం ఎంతో గొప్పదన్నారు.

