చంద్రబాబు కేసులో సీఐడీకి ఏసీబీ కోర్టు నోటీసులు
స్కిల్ స్కామ్‌లో అరెస్ట్ అయ్యి గతకొన్ని రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు జైలులో ఉంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు బెయిల్ కోసం ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ ఇవ్వలేమని ఏసీబీ కోర్టు ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో చంద్రబాబు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అయితే చంద్రబాబు బెయిల్‌పై ప్రస్తుతం హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. కాగా ఈ రోజు కూడా స్కిల్ స్కామ్ కేసులో హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో ఇరువురి వాదనలు విన్న హైకోర్టు విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. ప్రస్తుతం చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై విజయవాడ ఏసీబీ కోర్టు మరోసారి విచారిస్తోంది. కాగా చంద్రబాబు ఇటీవల జైలులో అస్వస్థతకు గురయ్యారు. దీంతో చంద్రబాబు కుటుంబ సభ్యులు ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు.ఈ మేరకు చంద్రబాబు ఆరోగ్యంపై నివేదిక సమర్పించాలని చంద్రబాబు తరుపు లాయర్లు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశించింది.

