National

ఇకపై పోస్టల్ బ్యాలెట్ రద్దు

Share with

కేంద్ర ఎన్నికల సంఘం ఒక సంచలన నిర్ణయం తీసుకుంటోంది. సాధారణంగా ఎన్నికల సమయంలో ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగస్తులు పోస్టల్ బ్యాలెట్‌ను ఉపయోగించి ఓటు వేస్తూ ఉంటారు. అయితే ఇక మీదట ఈ విధానానికి స్వస్తి పలుకనున్నట్లు తెలుస్తోంది. పోస్టల్ బ్యాలెట్‌ను రద్దు చేసి ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లలో వారు తమ ఓట్లు వేసుకునేలా కీలక మార్పులు చేయబోతోంది. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖకు గత వారం ప్రతిపాదనలు పంపినట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం తెలియజేసింది. ఫెసిలిటేషన్ సెంటర్లలో ఓట్ల వినియోగం కోసం ఎన్నికల నిర్వహణ చట్టం 1961లోని 18 వ నిబంధనకు సవరణలు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండేల  ఈ సూచనలు చేశారు. ఇప్పటి వరకూ  ఎన్నికల విధుల్లో ఉన్నవారు, సర్వీస్ ఓటర్లు, పోలీస్ కస్టడీలో ఉన్నవారు పోస్టల్ బ్యాలెట్‌ను ఉపయోగించే వారు. అయితే ఇక మీదట ఈ విధానం రద్దు చేయనుండడంతో వీరంతా ఫెసిలిటేషన్ సెంటర్లలోనే ఓటు వేసేలా చట్టంలో మార్పు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేటందుకే ఈ ప్రతిపాదన తీసుకొచ్చినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.