త్వరలో తెరపైకి రానున్న అబ్దుల్ కలాం జీవితం
ఈమధ్యకాలంలో సినీ పరిశ్రమలో వరుసగా బయోపిక్స్ వస్తున్నాయి. ఈ ట్రెండ్‌ను అనుసరించి మరో ప్రముఖ వ్యక్తి జీవితం, చిత్రంగా రాబోతోంది. ‘కాశ్మీర్ ఫైల్స్’ , ‘కార్తికేయ-2’ చిత్రాలతో వరుస ఘన విజయాలు సాధించిన తెలుగు నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఇది భారత మాజీ రాష్ట్రపతి, ‘మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా పిలువబడే ‘డాక్టర్ అబ్దుల్ కలాం’ జీవితం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న చిత్రం. నిర్మాత అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకరతో కలిసి ఈ సినిమా తీయబోతున్నట్లు తెలిపారు.

త్వరలోనే లాంచింగ్ చేస్తామని, అప్పుడు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు అభిషేక్ అగర్వాల్. ఈ బయోపిక్ తీయడానికి కలాం కుటుంబ అనుమతి తీసుకున్నామన్నారు. మహాత్మాగాంధీ తర్వాత దేశ ప్రజల్లో మహాత్మునిగా నిలిచిపోయిన వ్యక్తి కలాం అనీ, ఆయన జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని, అందుకే ఆయన జీవిత చరిత్రను సినిమాగా తీయాలనుకుంటున్నానని తెలియజేసారు. ఈ చిత్రానికి ఇంకా నటీనటులు, దర్శకుడు ఎవరనేది నిర్ణయించలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం అభిషేక్ గూఢచారి 2 ప్రాజెక్టుపై బిజీగా గడుపుతున్నారు. దీని తర్వాత కలాం సినిమాను తెరకెక్కిస్తామని అన్నారు.

