విద్యార్థుల దార్శనికుడు అబ్దుల్ కలామ్
నేడు (అక్టోబర్ 15న) విద్యార్థులకు చక్కటి జీవన మార్గాన్ని బోధించిన మాజీ రాష్ట్రపతి, దార్శనికుడు అబ్దుల్ కలాం జయంతి. ‘సక్సెస్ అంటే సంతకాన్ని ఆటోగ్రాఫ్‌గా మార్చుకోవడమే’ అంటూ ప్రభోదించిన గొప్ప మార్గదర్శి ఆయన. ‘గెలుపును పట్టుకోవాలని చూడకూడదు. అది నీడ లాంటిది. నీ దారిలో నువ్వు వెళ్తుంటే అదే నిన్ను అనుసరిస్తుంది’ అంటూ నిజమైన విద్యను తెలియజేశారు. అందుకే ఈ రోజును ఆయన జ్ఞాపకార్థం భారత ప్రభుత్వం విద్యార్థుల దినంగా ప్రకటించింది. ఆయన సంప్రదాయ తమిళ ముస్లింల కుటుంబంలో 1931, అక్టోబర్ 15న జన్మించారు. రామేశ్వరం వద్ద గల పంబన్ ఐలాండ్ ఆయన జన్మస్థలం. అక్కడ మత్సకారుల కుటుంబం వారిది. చిన్నతనం నుండి ఎంతో కష్టపడి చదివి భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో ఏరోస్పేస్ ఇంజనీరుగా చేరి, ఎన్నో ప్రయోగాలలో పాల్గొన్నారు. భారత దేశపు మిస్సైల్ మ్యాన్‌గా పేరు పొందారు. కలామ్ భారత దేశ పోఖ్రాన్ అణు పరీక్షలలో కీలకమైన పాత్ర పోషించారు. 2002 నుండి 2007 వరకూ ఐదేళ్ల పాటు భారత రాష్ట్రపతిగా పనిచేశారు. ప్రజలు మెచ్చిన రాష్ట్రపతిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. 1997లో భారతరత్న పురస్కారాన్ని పొందారు. ఆయన జీవితకాలంలో ఎన్నో డాక్టరేట్లు, ప్రభుత్వ బిరుదులు, సత్కారాలు పొందారు. ఆయన ఎన్నో స్ఫూర్తిదాయక వ్యాఖ్యానాలు చేసి, ఎందరో విద్యార్థులను గొప్పవారిగా తీర్చిదిద్దారు. ఆయన కోరుకున్నట్లుగానే విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తూ 2015 జూలై 27 నాడు షిల్లాంగ్ ఐఐఎంలో గుండెపోటుతో కుప్పకూలి కన్నుమూశారు. ఆయన స్మారకార్థం తమిళనాడులోని రామేశ్వరంలో పేయ్‌కంబూర్ గ్రామంలో డిఆర్‌డీఓ జాతీయ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. దీనిని ప్రధాని మోదీ 2017 జూలైలో ప్రారంభించారు.