ఆరా ఫౌండేషన్ శివరాత్రి ఆహ్వానం…
మహాశివరాత్రి పర్వదినాన్ని పునస్కరించుకుని కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి దేవస్థాన సన్నిధిలో జరుగు ఉత్సవాలకు షేక్ మస్తాన్ (ఆరా మస్తాన్) ఆధ్వర్యంలోని ఆరా ఫౌండేషన్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. శివరాత్రి సందర్భంగా భక్తులకు పెద్దఎత్తున అన్నదానాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆరా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆరా మస్తాన్ తాతగారైన జనాబ్ షేక్ మహబూబ్ జ్ఞాపకార్థం ప్రతి ఏడాది ఆరా ఫౌండేషన్ నిర్వహించే అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆనవాయితీగా ఏర్పాటు చేస్తున్నారు. ఫిబ్రవరి 25 మంగళవారం ప్రారంభమయ్యే ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమము చిలకలూరిపేట నుండి కోటప్పకొండ దేవస్థానము వరకు జరుగుతుంది. 20 మొబైల్ వాహనాల ద్వారా ఫిబ్రవరి 27 గురువారం వరకు మూడు రోజులపాటు జరుగుతుంది. కోటప్పకొండకు విచ్చేయు భక్తులతో పాటుగా ప్రభల నిర్వాహకులు, పోలీసు, ఆర్.టి.సి, విద్యుత్, వైద్య-ఆరోగ్యశాఖ ఉద్యోగులు, తోపుడు బండ్లపై వ్యాపారము నిర్వహించుకొను చిరువ్యాపారుల సౌకర్యార్థమై ఈ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఈ 3 రోజులపాటు మద్దిరాలలోని వారి స్వగృహము,చిలకలూరిపేట అడ్డరోడ్ సెంటర్, మరియు కోటప్పకొండ దిగువ భాగమున ఏర్పాటు చేయబడిన శిబిరములో నిత్యాన్నదానం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భక్తులందరూ విచ్చేసి అన్నప్రసాదములను స్వీకరించి ఆ త్రికోటేశ్వరుని కృపకు పాత్రులు కావలసిందిగా ఆరా మస్తాన్ విజ్ఞప్తి చేశారు.
