NationalNews

గుజరాత్‌లో బీజేపీని గెలిపించనున్న ఆప్‌..!

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబరు 1, 5 తేదీల్లో రెండు విడతలుగా జరగనున్నాయి. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో బీజేపీ వరుసగా ఏడోసారి అధికారాన్ని చేపట్టే దిశగా దూసుకెళ్తోంది. ఈసారి బీజేపీని గుజరాత్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ గెలిపించే సూచనలు కనిపిస్తున్నాయి. అదెలాగంటే.. ఇంతకాలం కాంగ్రెస్‌, బీజేపీ మధ్య ముఖాముఖి పోటీ జరిగింది. ఇప్పుడు త్రిముఖ పోరులో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను కాంగ్రెస్‌, ఆప్‌ పంచుకుంటాయి. బీజేపీకి ప్రత్యేక ఓటు బ్యాంకు ఉండనే ఉంది. 2017 ఎన్నికల్లో పటీదార్ల ఉద్యమం రూపంలో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత కనిపించింది. ఈసారి అలాంటి వ్యతిరేకత లేదు. పైగా.. ప్రధాని మోదీ నేతృత్వంలో గుజరాత్‌ సర్వతోముఖాభివృద్ధి సాధించింది.

ఇది నేను నిర్మించిన గుజరాత్‌..

2017 అసెంబ్లీ ఎన్నికల్లో గుజరాత్‌లో పటీదార్లు, ఓబీసీలు బీజేపీపై తీవ్ర వ్యతిరేకత కనబర్చడంతో మ్యాజిక్‌ ఫిగర్‌ అయిన 92 సీట్ల కంటే బీజేపీ కేవలం 7 సీట్లే ఎక్కువ సాధించింది. ఈసారి వాళ్లంతా కాషాయ పార్టీకి సానుకూలంగానే ఉన్నారు. రాష్ట్రంలో బీజేపీపై నెగెటివ్‌ సెంటిమెంట్‌ పెద్దగా కనిపించకున్నా.. సుదీర్ఘకాలంగా అధికారంలో ఉండటంతో ఏర్పడే ప్రభుత్వ వ్యతిరేక ఓటును అటు కాంగ్రెస్‌, ఇటీ ఆప్‌ పంచుకుంటున్నాయి. ప్రధాని మోదీ కూడా సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో విస్తృతంగా పర్యటిస్తూ.. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తూ.. బీజేపీ కార్యకర్తల్లోనూ జోష్‌ నింపుతున్నారు. ‘ఇది నేను నిర్మించిన గుజరాత్‌’ అంటూ పోస్టర్ల రూపంలో ప్రధాని మోదీ చేస్తున్న విస్తృత ప్రచారం ప్రజలను ఆకట్టుకుంటోంది.

ఉచిత చార్‌ధామ్‌ యాత్ర అంటున్న ఆప్‌..

ఆప్‌ తన మానస పుత్రికలైన విద్య, వైద్య రంగాల్లో సంస్కరణలు తీసుకొస్తానంటూ చేస్తున్న ప్రచారాన్ని పట్టణ ప్రాంత ప్రజలు నమ్ముతున్నారు. మరోవైపు అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్తుతో పాటు ఉచిత చార్‌ధామ్‌ యాత్ర చేయిస్తామంటూ ఆప్‌ చేస్తున్న వినూత్న ప్రచారం సామాన్య ప్రజలను ఆకట్టుకుంటోంది. ఇలా ఆప్‌ దూకుడు పెంచడంతో కాంగ్రెస్‌ ఓటర్లు అటువైపు ఆకర్షితులవుతున్నారు. కాంగ్రెస్‌ నుంచి డజను మందికి పైగా ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినా పట్టించుకోక పోవడం కాంగ్రెస్‌ పార్టీ చతికిల పడిందనడానికి నిదర్శనంగా నిలిచింది. పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేస్తున్న భారత్‌ జోడో యాత్ర గుజరాత్‌లో కొనసాగకపోవడం కాంగ్రెస్‌కు నష్టదాయకంగా మారింది. మొత్తానికి.. ఈసారి కూడా గుజరాత్‌ గద్దెపై కమలం వికసిస్తుందని సర్వేలన్నీ ముక్తకంఠంతో చెబుతున్నాయి.