Home Page SliderNational

మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో అన్ని సీట్లలో ఆప్ పోటీ:కేజ్రీవాల్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఇవాళ మధ్యప్రదేశ్‌లో ఎన్నికల శంఖారావం పూరించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతాలో మరో రాష్ట్రాన్ని చేర్చుతామంటూ ఇద్దరు నేతలు ప్రతిజ్ఞ చేశారు. రాజస్తాన్ పర్యటన తర్వాత ఇవాళ ఇద్దరు సీఎంలు మధ్యప్రదేశ్ వచ్చారు. మధ్యప్రదేశ్‌‌లో ఈ ఏడాది చివరిలో అసంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్‌లోని మొత్తం 200 అసెంబ్లీ స్థానాలు, మధ్యప్రదేశ్‌లోని 230 స్థానాల్లో పోటీ చేస్తామని ఆప్ ప్రకటించింది. భోపాల్‌లో జరిగిన బహిరంగ సభలో, కమల్ నాథ్ ప్రభుత్వాన్ని కూల్చివేసిన జ్యోతిరాదిత్య సింధియా ఫిరాయింపుపై అధికార బీజేపీపైనా, కాంగ్రెస్‌ పైనా కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు.

“మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాలను కొంటారు, అమ్ముకుంటారు.. ప్రతి ఎన్నికల తర్వాత ఒక పార్టీ ఎమ్మెల్యేలను అమ్మకానికి పెడుతుంది’ మరో పార్టీ కొంటుంది” అన్నాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని చూసి… “మధ్యప్రదేశ్‌లో ప్రజలు నిరుత్సాహాంగా ఉన్నారన్నారు. ప్రజలు ఎవరికి ఓటు వేసినా ‘మామ’ ప్రభుత్వమే వస్తుంది” అని ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌పై విరుచుకుపడ్డారు. ఆప్ అధికారాన్ని చేజిక్కించుకోక ముందు ఢిల్లీ, పంజాబ్‌లు రెండూ కాంగ్రెస్‌ ఏలుబడిలో ఉండేవి. ఈ ఏడాది రాజస్తాన్, మధ్యప్రదేశ్ రెండు చోట్ల సత్తా చాటాలని ఆప్ భావిస్తోంది. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌తో పాటు ఛత్తీస్‌గఢ్‌లో కూడా ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. 2018లో, మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచింది. అయితే 2020లో జ్యోతిరాదిత్య సింధియా, కాంగ్రెస్ పార్టీని విభేదించడంతో 20 మంది ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతుగా నిలిచారు దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది. మధ్యప్రదేశ్‌పై కాంగ్రెస్ నియంత్రణ కోల్పోయింది.

ఇటీవల జరిగిన బీజేపీ పాలిత గుజరాత్‌లో AAP హై-ప్రొఫైల్ ప్రచారం, అంచనాలకు అందలేదు. రాష్ట్రంలోని 182 స్థానాల్లో 180 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ కేవలం ఐదు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. దాదాపు 120 మంది అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు. అయితే ఆ పార్టీ దాదాపు 13 శాతం ఓట్లను సాధించి జాతీయ పార్టీ హోదాను పొందింది. ఈసారి, మధ్యప్రదేశ్‌తో పాటు, ఇతర బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్ణాటకలో కూడా ఆప్ పోటీ చేస్తోంది. మధ్యప్రదేశ్‌లో, దాదాపు 5 లక్షల మంది సభ్యులను కలిగి ఉన్న పార్టీ, గత ఏడాది జూలై-ఆగస్టులో జరిగిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలలో దాని పనితీరుతో ఉత్సాహంగా ఉంది. అక్కడ అది 6.3 శాతం ఓట్ షేర్‌ను సాధించింది. స్థానిక సంస్థల ఎన్నికలకు 1,500 మంది అభ్యర్థులను నిలబెట్టింది సింగ్రౌలిలో మేయర్ పదవిని గెలుచుకొంది.