ఆధార్‌ను ప్రతి పదేళ్లకోసారి అప్‌డేట్ చేసుకోవాలి..
న్యూఢిల్లీ, నవంబరు 12: ఆధార్‌కు సంబంధించిన నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పు చేసింది. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ తేదీ నుంచి 10 ఏళ్లు పూర్తయ్యాక కార్డుదారుడి సమాచారాన్ని ధ్రువీకరించే పత్రాలను (documents) కనీసం ఒక్కసారైనా అప్‌డేట్ చేయడాన్ని తప్పనిసరి చేసింది. సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రెపాజిటరీలో (CIDR) కచ్ఛితమైన ఆధార్ సమాచారాన్ని కొనసాగించేందుకు ఈ అప్‌డేట్ దోహదపడనుందని కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

‘‘ఆధార్ నంబర్ ఉన్న వ్యక్తులు ఎన్‌రోల్‌మెంట్ తేదీ నుంచి ప్రతి 10 ఏళ్లకోసారి ధ్రువీకరణ పత్రాలను అప్‌డేట్ చేసుకోవాలి. కనీసం ఒక్కసారైనా ఈ ప్రక్రియ చేయాలి. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ (POI), ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ (POA) పత్రాలను సమర్పించి అప్‌డేట్ చేసుకోవచ్చు. సీఐడీఆర్‌లో కచ్ఛితమైన సమాచారాన్ని కొనసాగించేందుకు కాలానుగుణంగా అప్‌డేట్ చేసుకోవాలి’’ అని గెజిట్‌లో కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆధార్ (ఎన్‌రోల్‌మెంట్ అండ్ అప్‌డేట్) నిబంధనల్లో మార్పులు చేసింది..