NationalNews

హిజాబ్‌ ధరించిన మహిళ దేశానికి ప్రధాని కావాలి

హిజాబ్‌ ధరించిన మహిళను భారత ప్రధానిగా చూడాలని కోరుకుంటున్నట్లు హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ కీలక కామెంట్స్‌ చేశారు.  కర్ణాటకలో త్వరలో జరగనున్న మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల కోసం బీజాపూర్‌లో రోడ్‌షో నిర్వహించారు. ఈ నెల 28న జరగనున్న బీజాపూర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఎంఐఎం నాలుగు వార్డుల్లో పోటీ చేస్తోంది.

ఈ సందర్భంగా ఆయన హిజాబ్‌ గురించి ప్రస్తావించారు. బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ..  “ప్రజాస్వామ్య బద్ధంగా ఆ దేశంలో (బ్రిటన్‌) ప్రధానిని మార్చేశారు. అది వాళ్ళ నిర్ణయం. కానీ.. హిజాబ్‌ ధరించడంపై మన దగ్గర నిషేధం అమలవుతోంది. నేనొకటే చెబుతున్నాను. నేను బతికున్నప్పుడో లేదంటే నా తరవాతైనా సరే హిజాబ్‌ ధరించిన మహిళ దేశానికి ప్రధాని కావాలని కోరుకుంటున్నాను“ అని వెల్లడించారు. బ్రిటన్‌లో తొలిసారి ఓ నాన్‌ క్రిస్టియన్‌ ప్రధాని అవడంపై ఈ విధంగా అసదుద్దీన్‌ స్పందించారు. అయితే… ఒవైసీ కామెంట్స్‌ కాస్త వైరల్‌గా మారాయి.