కువైట్లో ఏపీ మహిళపై దాష్టీకం..
బతుకుతెరువు కోసం కువైట్కు వెళ్లిన ఏపీలోని కాకినాడ జిల్లా పొన్నాడకు చెందిన కాకాడ లక్ష్మి అనే మహిళపై కువైట్లోని యజమానులు దాష్టీకానికి పాల్పడ్డ సంఘటన వెలుగులోకి వచ్చింది. భర్తను కోల్పోయిన లక్ష్మి ఉపాధి కోసం ఒక ఏజెంట్ ద్వారా కువైట్కు వెళ్లారు. అక్కడ ఒక ఇంట్లో పని చేస్తే నెలకు 150 దీనార్లు వేతనంగా ఇస్తామని మాట్లాడుకున్నారు. కానీ పనులు చేయించుకుని, 100 దీనార్లే ఇవ్వడంతో లక్ష్మి వారిని ప్రశ్నించింది. దీనితో ఆగ్రహం చెందిన వారు ఆమెపై యాసిడ్ దాడి చేసి, ఆపై పిచ్చాసుపత్రిలో చేర్పించారు. కాస్త కోలుకున్న ఆమె, ఆసుపత్రి వర్గాల సహాయంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఆమె పాస్పోర్టు యజమానుల వద్ద ఉందని, కేసు వాపస్ తీసుకుంటేనే ఇస్తామని చెప్తున్నారని పేర్కొన్నారు. ఏం చెయ్యాలో తెలియక ఆసుపత్రిలోనే ఉండిపోయిన ఆమె తనకు ఏపీ ప్రభుత్వం అండగా నిలిచి, ఏపీకి రప్పించేందుకు సహకరించాలని కోరుతున్నారు.