Home Page SliderInternational

బంగ్లా పులుల చేతిలో పాకిస్తాన్‌కు ఘోర అవమానం

బంగ్లాదేశ్ దెబ్బకు పాకిస్తాన్ విలవిల…
వరుసగా రెండో టెస్టులోను ఓటమి
పాకిస్తాన్‌ గడ్డపైనే చిత్తు చేసిన బంగ్లా
బాబర్ అజమ్‌ రిటైర్ అంటూ ట్రోలింగ్స్

బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు పాకిస్తాన్‌లో అద్భుత ప్రదర్శనను కొనసాగించింది. సిరీస్‌ను 2-0తో ముగించింది. వరుసగా రెండో టెస్ట్ మ్యాచ్ విజయాన్ని సాధించింది. బంగ్లాదేశ్ జట్టు, పరాయి దేశంలో క్లీన్ స్వీప్ పూర్తి చేయడం ఇదే మొదటిసారి. పాకిస్థాన్ జట్టు జీవితాంతం గుర్తుండిపోయేలా ఓటమి అందుకుంది. 2009లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ క్రికెట్‌లో బంగ్లాదేశ్ స్వీప్ చేసింది. తొలి టెస్టులో 10 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసిన పాకిస్తాన్ రెండో టెస్టులోనే ఓడింది. రెండో టెస్టులో సత్తా చాటి సీరిస్ సమం చేయాలన్న కసిగా మ్యాచ్ ఆరంభించిన పాక్ పూర్తిగా విఫలమైంది. మూడేళ్ళ తర్వాత స్వదేశంలో పాకిస్తాన్ ఇంతటి ఘోర పరజాయాన్ని మూటగట్టుకుంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ రెంటిలోనూ జట్టు చతికిలపడింది. 2022 ఇంగ్లండ్ టూర్‌లో పాకిస్థాన్ స్వదేశంలో 0-3తో వైట్‌వాష్‌ను చవిచూసింది. తాజాగా ఇప్పుడు బంగ్లా పులుల చేతిలో 0-2తో ఓడింది.

రెండో టెస్టులో సయీమ్ అయూబ్, షాన్ మసూద్, ఆఘా సల్మాన్ హాఫ్ సెంచరీలు చేయడంతో పాకిస్థాన్ మొదటి ఇన్నింగ్స్‌లో 274/10 పరుగులు చేసింది. అయితే బాబర్ అజామ్ (31), అబ్దుల్లా షఫీక్ (0), సౌద్ షకీల్ (16), మహ్మద్ రిజ్వాన్ (29) రాణించలేకపోయారు. ఐతే తొలుత తడబడిన బంగ్లాదేశ్ కేవలం 26 పరుగులకే 6 వికెట్లు కోల్పోగా, లిట్టన్ దాస్ ఎదురుదాడి సెంచరీ చేయడంతో జట్టు మొత్తం 262 పరుగులకు చేరుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో, బంగ్లాదేశ్ బౌలర్లు దుమ్మురేపారు. దీంతో పాకిస్తాన్‌ 172 పరుగులకే ఆలౌట్ అయ్యింది. హసన్ మహ్మద్ 5 వికెట్ల తీశాడు. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో కొంత తడబడినా, 185 పరుగుల లక్ష్యాన్ని చేతిలో 6 వికెట్లు ఉండగానే ఛేదించింది.

ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ సూపర్ పేసర్ షాహీన్ షా అఫ్రిదీని నిజంగానే మిస్ అయినట్లు కనిపించింది. కొడుకు పుట్టడంతో రెండో టెస్టుకు ఎంపిక నుంచి అఫ్రిదీ తప్పుకున్నాడు. బంగ్లాదేశ్‌పై ఓటమి దేశ చరిత్రలో చీకటి అధ్యాయంగా నిలిచిపోతుంది. పాకిస్థాన్‌ను స్వదేశంలో టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన తొలి ఆసియా జట్టుగా బంగ్లాదేశ్ నిలిచింది. ఇక బాబర్ అజమ్ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైరైనట్టుగా పెద్ద ఎత్తున ట్రోల్ జరిగడంతో సంచలనంగా మారింది. నకిలీ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అనేక మంది అభిమానులు నకిలీ వీడ్కోలు మేసేజ్‌లను షేర్ చేసుకున్నారు. అది కూడా బాబర్ వేలిముద్రతో ప్రచారం చేయడం, అవమానకరమన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.