టీసీ ఇవ్వలేదని నిప్పంటించుకున్న విద్యార్థి
హైదరాబాద్ అంబర్‌పేట పరిధిలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఏకంగా కళాశాల ప్రిన్సిపల్ గదిలోనే పెట్రోల్ పోసుకొని నిప్పటించుకున్నాడు.వెంటనే మంటలు ఎగసిపడటంతో శరీరం కాలిపోతుండగానే వెంటనే వెళ్లి ప్రిన్సిపాల్ సుధాకర్‌రెడ్డిని పట్టుకున్నాడు. ప్రిన్సిపల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. నారాయణ కాలేజీకి చెందిన నారాయణ స్వామి అనే విద్యార్థి.. ప్రిన్సిపల్ తనకు టీసీ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో విద్యార్థి తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అప్రమత్తమైన కాలేజీ సిబ్బంది మంటలను ఆర్పారు.

ఈ ఘటనలో నారాయణ స్వామి తీవ్రంగా గాయపడ్డాడు. సిబ్బంది వెంటనే విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ప్రిన్సిపాల్ గదిలో మంటలు అంటుకుని ఏసీతో పాటు అక్కడి సామగ్రి కాలిపోయాయి. కళాశాల యాజమాన్యం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విద్యార్ధి సంఘాల నాయకులు కళాశాల వద్ద ధర్నా చేపట్టారు. కొంత మంది కళాశాలపై దాడి చేయడంతో అద్దాలు పగిలిపోయాయి. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

