గుజరాత్‌లో వింత వైరస్-ఆరుగురు చిన్నారులు మృతి
గుజరాత్‌లో వింత వైరస్ విజృంభిస్తోంది. దీనితో గత ఐదు రోజులలో ఆరుగురు చిన్నారులు మృతి చెందారు. దీనికి చాందీపుర అనే వైరస్ కారణమని అనుమానిస్తున్నారు. ఈ వైరస్ సోకడానికి దోమలు, కీటకాలు కారణమని తెలుస్తోంది. అయితే ఇది అంటువ్యాధి కాదని, దీనిని అదుపులో పెట్టే ప్రయత్నాలు చేస్తున్నామని ఆరోగ్యశాఖామంత్రి రిషికేశ్ పటేల్ వెల్లడించారు. ఇప్పటి వరకూ 20 వేల మందికి పరీక్షలు చేయగా, 12మందికి వ్యాధి సోకినట్లు తెలిసిందన్నారు. వీరందరూ ఆరావళి, మహిసాగర్, ఖేడా, సబర్ కాంతా అనే జిల్లాలకు చెందినవారని తెలుస్తోంది. వీరిలో రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లకు చెందినవారు కూడా ఉన్నారని మంత్రి తెలిపారు. వీరందరికీ గుజరాత్‌లోనే చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ వ్యాధి సోకిన వారిలో జ్వరం, ఫ్లూ, మెదడువాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రాధమిక పరీక్షలో చాందీపుర వైరస్‌గా నిర్థారించారని, మరింత విస్తృతస్థాయి పరీక్షల కోసం బాధితుల నమూనాలను పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపామని మంత్రి తెలియజేశారు.