గాడిద పాల వ్యాపారం చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి
“గంగిగోవు పాలు గరిటెడైనను చాలు కడివెడైననేమి కరము పాలు” అని చిన్నప్పుడు శతకాలలో చదువుకున్నాము కదా . కానీ ఇప్పుడు గోవు కంటే కరము (గాడిద) పాలే ఖరీదైపోయాయి. ఈ పాలు ఎన్నో వ్యాధులకు దివ్యఔషదంగా మారింది. తక్కువ మోతాదులో ఈ పాలు తీసుకోవడం వల్ల మనిషి ఆరోగ్యం చాలా మెరుగుపడుతుందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఇది చాలా లాభసాటిగా ఉండడంతో చాలమంది యువత ఇప్పుడు గాడిద పాలతో startup కంపెనీలు పెడుతున్నారు.

ఒకప్పుడు పనీ,పాటా లేకుండా ఖాళీగా తిరిగే అబ్బాయిలను చదువుకోకపోతే గాడిదలు కాస్తావా అంటూ తిట్టేవారు పెద్దవాళ్లు. ఇప్పుడు ఆమాటనే నిజం చేస్తున్నారు ఇంజనీరింగ్ చదువుకుని, గాడిదలు కాసుకొనే అబ్బాయిలు. తమాషాగా కాదండోయ్. గాడిద పాలతో కోట్లు సంపాదిస్తున్నారు. గాడిదల ద్వారా ఎంత సంపాదన ఉంటుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం తోకాడ దగ్గర ఉన్న మల్లంపూడి పంచాయతీలో కిరణ్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వినూత్న ఆలోచనతో ఈ DONKEY డైరీ ఫారం ఏర్పాటు చేసాడు. అతను ఈ వ్యాపారం పెట్టడానికి ప్రధాన కారణం అతని కుమారుడికి వచ్చిన అనారోగ్యమే. అతని కుమారునికి ఆస్మా సమస్య ఏర్పడింది. అది తగ్గాలంటే గాడిద పాలు తాగించాలని వైద్యులు చెప్పారు. దీనితో గాడిద పాలకోసం ఎంత ప్రయత్నం చేసినా దొరకలేదు. చివరికి 200ml గాడిద పాలకి 1000 రూపాయలు ఖర్చు చేసాడు. గాడిద పాలకి ఉన్న డిమాండ్ చూసి అతనిలో దీనిని వ్యాపారంగా మారిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. పైగా కొవిడ్ సమయంలో ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అతను దానిని వదిలేసి తిరిగి బెంగళూరు నుండి రాజమండ్రికి వచ్చాడు.

2022 జనవరిలో అక్కడ మల్లంపూడి గ్రామాన్ని ఎంచుకుని 10 ఎకరాల పొలాన్ని లీజుకు తీసుకుని సుమారు కోటి రూపాయల పెట్టుబడితో దేశం నలుమూలల నుండి వివిధ జాతులకు చెందిన గాడిదలను కొనుగోలు చేసి , వాటి ఆరోగ్య పరిస్థితులు, ఆహారపు అలవాట్లు తెలుసుకుని డైరీ ఫాం ఏర్పాటు చేసి, వాటి సంరక్షణకు సిబ్బందిని కూడా ఏర్పాటు చేసాడు. 5 ఆడగాడిదలను, 1 మగ గాడిదను పెంచుతూ, వాటికి పుట్టే పిల్లలకు కూడా సంరక్షణ కలిగిస్తూ డైరీని అభివృద్ధి చేసారు. ఒక గాడిద రోజుకు సుమారు 500 ml నుండి ఒక లీటరు దాకా పాలు ఇస్తాయని గాడిదల కాపలాదారుడైన రమణ చెపుతున్నారు. ఈ పాలను ప్రత్యేక స్టోరేజీలలో ఉంచి ఆన్ లైన్ ద్వారా ఆర్డర్స్ సంపాదించి పంపిణీ చేస్తుంటారు. ప్రస్తుతం గాడిదపాలు లీటరు 7వేల రూపాయలు పలుకుతోంది. పాలు మాత్రమే కాక వాటి మలమూత్రాలను కూడా రకరకాల ఔషదాలలో ఉపయోగిస్తున్నారు. చూసారా.. మనసుండాలే కానీ మార్గాలెలా దొరుకుతున్నాయో..

