లోకాయుక్త అధికారులను చూసి లంచాన్ని మింగేసిన ఉద్యోగి
ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకోవడం నేరమని ఉద్యోగులతో సహ అందరికీ తెలిసిన విషయమే. అయితే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు డబ్బులకు కక్కుర్తి పడి ప్రజల దగ్గర అన్యాయంగా లంచాన్ని ఆశిస్తున్నారు. ఇలా లంచం తీసుకునేటప్పుడు అధికారులకు చిక్కితే ఆ ఉద్యోగుల పని అయిపోయిందనే చెప్పాలి. అయితే ఈ విధంగా లంచం తీసుకుంటు లోకాయుక్తా అధికారులకు దొరికిన వ్యక్తి లంచాన్ని మింగేసి అధికారులకు షాక్ ఇచ్చాడు. కాగా ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

గజేంద్ర సింగ్ అనే వ్యక్తి మధ్యప్రదేశ్‌లోని కట్నీ ప్రాంతంలో రెవెన్యూ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కాగా ఆయన ఓ పని కోసం తన వద్దకు వచ్చిన వ్యక్తిన రూ.5000 లంచం అడిగాడు. దాంతో ఆ వ్యక్తి లోకాయుక్త అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయితే దీనిపై స్పందించిన అధికారులు గజేంద్ర సింగ్‌ను స్పాట్‌లోనే పట్టుకునేందుకు ప్లాన్ చేశారు. ప్లాన్‌లో భాగంగానే గజేంద్ర సింగ్‌కు చెందిన ప్రైవేట్ ఆఫీసులో సదరు వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా లోకాయుక్త అధికారులు ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యారు. ఈ ఊహించని పరిణామంతో గజేంద్ర సింగ్ ఒక్కసారిగా కంగుతిని తన చేతిలో ఉన్న రూ.5000 రూపాయలను అమాంతం మింగేశాడు. దీంతో లోకాయుక్త అధికారులు నివ్వెర పోయారు. కాగా అధికారులు వెంటనే అప్రమత్తమై గజేంద్ర సింగ్‌ను హాస్పటల్‌కు తరలించారు. అక్కడ గజేంద్ర సింగ్‌ను పరీక్షించిన వైద్యులు తనకి ఎలాంటి ప్రమాదం లేదని వెల్లడించారు. దీంతో అక్కడి వారంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన నిన్న జరగ్గా దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

