నేడు అరుదైన సూర్య గ్రహణం
22 ఏళ్ల తర్వాత అరుదైన సూర్య గ్రహణం మంగళవారం ఏర్పడనుంది. నిజానికి గ్రహణాలు రాహు, కేతు ప్రభావాలతో ఏర్పడుతాయి. రాహు ప్రభావంతో ఏర్పడే గ్రహణాన్ని రాహు గ్రస్తమని.. కేత ప్రభావంతో ఏర్పడే గ్రహణాన్ని కేత గ్రస్తమని అంటారు. ఈ రోజు ఏర్పడేది కేతుగ్రస్త సూర్య గ్రహణం. సాయంత్రం 4 గంటల 29 నిమిషాలకు ప్రారంభమయ్యే ఈ సూర్య గ్రహణం సూర్యాస్తమయం తర్వాత కూడా కొనసాగి సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు ముగుస్తుంది. హైదరాబాద్‌లో మాత్రం 4 గంటల 59 నిమిషాలకు ప్రారంభమై 5 గంటల 48 నిమిషాలకు ముగుస్తుంది. పాక్షిక గ్రహణ ప్రభావం ప్రధానంగా ఒక గంట 45 నిమిషాల పాటు ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఇది ఈ ఏడాది రెండో సూర్య గ్రహణం.

సూర్యుడిని నేరుగా చూడొద్దు..
సూర్యునికి, భూమికి మధ్య చంద్రుడు రావడాన్నే సూర్య గ్రహణం అంటారు. సూర్య కాంతి భూమికి చేరకుండా చంద్రుడు కొంత సమయం అడ్డుకోవడంతో చంద్రుడి నీడ భూమిపై పడుతుంది. ఫలితంగా సూర్యుడిలోని కొంత భాగం కనిపించకపోవడమే సూర్య గ్రహణం. ఈ సూర్య గ్రహణం ఐరోపా, ఈశాన్య ఆఫ్రికా, పశ్చమాసియాలోని వివిధ ప్రాంతాల్లో చక్కగా కనబడుతుంది. భారత్‌లో మాత్రం పాక్షిక గ్రహణం కనువిందు చేస్తుంది. హైదరాబాద్‌తో సహా ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై, ఉజ్జయిని, వారణాసి, మధుర తదితర నగరాల్లో సూర్య గ్రహణం దర్శనమిస్తుంది. ఈ సూర్య గ్రహణాన్ని నేరుగా కళ్లతో చూస్తే గుడ్డి వాళ్లుగా మారే ప్రమాదం ఉంది. అల్యూమినైజ్డ్ మైలార్, బ్లాక్ పాలిమర్, వెల్డింగ్ గ్లాసెస్ తదితర పరికరాల సాయంతో గ్రహణాన్ని వీక్షించవచ్చు. టెలిస్కోప్ ద్వారా కూడా సూర్య గ్రహణాన్ని చూడొచ్చు. గ్రహణం సమయంలో చిన్న పిల్లలను బయటకు పంపించకూడదని పండితులు చెబుతున్నారు.

గ్రహణం సమయంలో ఆహారం తీసుకోవదు..?
గ్రహణం సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోకూడదని వేద పండితులు చెబుతున్నారు. ఈ సారి కేతు గ్రస్త సూర్యగ్రహణం స్వాతి నక్షత్రంలో ఏర్పడుతోంది. దీంతో ఈ నక్షత్రంలో జన్మించిన వారు, గర్భవతులు సూర్య గ్రహణాన్ని చూడొద్దని హెచ్చరిస్తున్నారు. గ్రహణ సమయంలో జపం, దానం వంటివి చేస్తే ఎంతో ఫలితాన్ని ఇస్తాయట. గ్రహణం పూర్తయిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకొని.. గ్రహణ స్నానం ఆచరించి.. ఆ తర్వాతే భోజనం చేయాలని.. అప్పటి వరకు ఎలాంటి ఆహారం ముట్టకూడదని పండితులు సూచిస్తున్నారు.

గ్రహణం సమయంలో తినొచ్చు: జనవిజ్ఞాన వేదిక
జనవిజ్ఞాన వేదిక వంటి సంస్థల ప్రతినిధులు మాత్రం 22 ఏళ్ల తర్వాత కనిపించే ఈ ఖగోళ అద్భుతాన్ని అందరూ చూసి తరించాలని చెబుతున్నారు. సూర్యుడిని నేరుగా చూడకుండా.. అల్యూమినైజ్డ్ మైలార్, బ్లాక్ పాలిమర్, వెల్డింగ్ గ్లాసెస్, స్కానింగ్ ఫిల్మ్ వంటివి ఉపయోగించి చూడొచ్చని సూచిస్తున్నారు. గ్రహణ సమయంలో ఏమీ తినొద్దన్నది కూడా సరికాదంటూ.. గ్రహణ సమయంలోనే ఈ ప్రతినిధులు ఎన్నోసార్లు సామూహికంగా అల్పాహారం ఆరగించారు. గర్భిణులను కూడా బయటికి తీసుకొచ్చి గ్రహణాన్ని చూపించారు. అయితే.. గ్రహణ సమయంలో సూర్యుడిని నేరుగా చూస్తే సూర్యుడి కిరణాల్లోని అతినీలలోహిత కాంతి, పరారుణ, రేడియో తరంగాలు, ఎక్స్ కిరణాలు, గామా కిరణాలు.. రేడియేషన్‌ను కలిగి ఉంటాయని.. అందుకే జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని సూచించారు

