InternationalNews

ఐకాన్ స్టార్‌కి అరుదైన గౌరవం

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు యూనైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికాలో అరుదైన గౌరవం లభించింది. యూఎస్‌ఏలోని న్యూయార్క్ ప్రతి సంవత్సరం నిర్వహించే `ఇండియా డే’ పరేడ్‌కు యావత్‌ భారత్‌ దేశానికి ప్రాతినిథ్యం వహిస్తూ గ్రాండ్‌ మార్షల్‌ హోదాలో అల్లు అర్జున్‌ హాజరయ్యారు.

ఈసారి 75వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా న్యూయార్క్‌లో గ్రాండ్‌గా కావాతు నిర్వహించారు. ఈ సందర్భంగా బన్నీకి న్యూయార్క్‌ సిటీ మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ ఘన స్వాగతం పలికారు. అలాగే ఈ పరేడ్‌కు దాదాపు 5 లక్షల మందికి పైగా భారతీయులు వచ్చారు. భారత దేశం పట్ల తమకున్న దేశభక్తిని, బన్నీపై అభిమానాన్ని చాటుకున్నారు. ఈ స్థాయిలో న్యూయార్క్‌ డే పరేడ్‌కు ప్రవాసులు రావడం ఓ రికార్డుగా ఇండియా డే పరేడ్‌ ప్రతినిధులు అభివర్ణిస్తున్నారు.

ఈ మార్షల్‌లో అల్లు అర్జున్‌, ఆయన సతీమణి స్నేహారెడ్డి కూడా హాజరయ్యారు. వైట్‌ డ్రెస్‌ ధరించిన బన్నీ జాతీయ జెండాను ఎగురవేస్తూ న్యూయార్క్‌ వీధుల్లో మార్షల్‌ నిర్వహించారు. తాజాగా ఇదే వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ ద్వారా పంచుకున్నారు. `న్యూయార్క్‌లో జరిగిన ఇండియా డే పరేడ్‌లో గ్రాండ్‌ మార్షల్‌కు హాజరవడం గౌరవంగా ఉందని’ అన్నారు.

అలాగే ఈ సందర్శన భాగంగా అల్లు అర్జున్‌కు ఘన సత్కారం లభించింది. న్యూయార్క్‌ మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ బన్నీని సత్కరించి, సర్టిఫికెట్‌ను అందించారు. బన్నీని కలిసినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం అల్లు అర్జున్‌ `పుష్ప-2’ సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నారు.