Home Page SliderTelangana

తండ్రి 100 వ పుట్టినరోజున ప్రేమతో కుమారుని అరుదైన కానుక

‘విత్తు ఒకటి వేస్తే చెట్టు ఒకటి వస్తుందా’?. ఆ తండ్రి ఆదర్శాలను పుణికి పుచ్చుకున్నాడా కుమారుడు. తండ్రి చేస్తున్న సేవా కార్యక్రమాలను చూసి, అదే బాటలో పయనించాడు. తండ్రి 100వ పుట్టినరోజు సందర్భంగా అరుదైన కానుక నందించాడు. విద్య, ఆరోగ్య, క్రీడా, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సహాయం చేస్తున్న ఏలూరు జిల్లాకు చెందిన అప్పసాని శేషగిరిరావు గారు 100 సంవత్సరాల పుట్టినరోజు పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని కోకాపేటలో వేడుకలు నిర్వహించారు. ఆయన చిన్నకుమారుడు రవికుమార్ కూడా తండ్రిలాగే సహృదయుడు. తన తండ్రి పేరుతో అనేక సేవాకార్యక్రమాలు చేస్తున్నారు. తన తండ్రి 101 వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా 2 కోట్ల రూపాయలు  విరాళాలు ఇచ్చారు. హైదరాబాద్‌లోని హృదయ ఫౌండేషన్‌కు వందమంది చిన్నారుల ఆపరేషన్లకు గాను కోటి రూపాయలు, కృష్ణాజిల్లా పెరిశేపల్లిలోని చెరుకూరి వృద్ధాశ్రమానికి ఏభై లక్షలు, హైదరాబాద్ లోని దుర్గాబాయ్ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు 25 లక్షలు, నారాయణపురంలోని అరవింద శత జయంతి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 25 లక్షలు సహాయంగా అందించారు. ఆయన కుమార్తెలు కూడా యధాశక్తి ఉంగుటూరులో ఆనంద నిలయం వృద్ధాశ్రమానికి రెండు లక్షలు విరాళం ఇచ్చారు.  డబ్బున్న ఆసామిలందరికీ ఇలాగే మంచి మనసుంటే ఎంత బాగుంటుందో కదా?