యువరాణికి కూడా తప్పని గృహహింస-పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రిన్సెస్
రాజవంశాలలో ఎన్నో రహస్యాలు, బయటకు కనిపించని కన్నీళ్లు దాగి ఉంటాయంటే అతిశయోక్తి కాదు. రాణులు, యువరాణుల జీవితాలేం పూలబాట కాదు. ఈ విషయం నిరూపిస్తోంది మాజీ ప్రధాని విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ మనుమరాలు, బొలంగీర్ రాజప్రసాదం కోడలు, యువరాణి అద్రిజా. రాజభవనంలో తాను ఎదుర్కొన్న కష్టాలు, అవమానాలు బయటపెట్టింది. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. సినిమాలలో చూసినట్లు యువరాణి జీవితం ఉందనుకుంటే పొరపాటే. వారికి కూడా సినిమాకష్టాలు ఉంటాయి. భర్త యువరాజు అర్కేజ్ సింగ్ దేవ్‌పై గృహహింస కేసు పెట్టింది.

ఇదంతా అన్యాయమంటున్నాడు యువరాజు. తాను ఆరునెలల క్రితమే ఇల్లు వదిలి వెళ్లిపోయానని, ఆమె తండ్రి కూడా చాలాసార్లు రాజమందిరానికి వచ్చేవారని తెలియజేశాడు. ఇంట్లో సీసీ టీవీ కెమెరాలు ఉన్నాయని, తాను నెలకొకసారి మాత్రమే తాను ఇంటికి వెళుతున్నానని చెప్పాడు. షహారాపూర్‌లోని ల్యాండ్ మాఫియాతో తన మామగారికి సంబంధాలు ఉన్నాయని ఆరోపించాడు.తన భర్త గత ఏడాదిగా తనను విడాకుల కోసం వేధిస్తున్నారని ఆరోపిస్తోంది అధ్రిజ. తన భర్తతో పాటు బావగారు, మామగారు, అత్తగారు కూడా అధిక కట్నం, విడాకుల కోసం వేధిస్తున్నారని పేర్కొంది. వీరందరిపై గత సెప్టెంబరులోనే ఫిర్యాదు చేసింది. తన ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఉత్తరాఖండ్ డిజిపికి కంప్లైంటు చేసింది. తనను హత్యచేయడానికి కిరాయి వ్యక్తులతో ఒప్పందం చేసుకున్నారని, తనపై నిఘా పెట్టారని వాపోతోంది. ప్రస్తుతం ఈ కేసును డెహ్రాడూన్ ఎస్పీకి అప్పగించారు.