NewsTelangana

హైదరాబాద్‌లో కొత్త తరహా నేరం

తెలంగాణా రాజధాని నగరం  హైదరాబాద్ కొత్త తరహా నేరాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. నగరంలో ప్రతిరోజు వింత నేరాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అదేంటంటే నగరంలోని ఒక ముఠా ఓ వర్గానికి చెందిన యువతులే టార్గెట్‌గా వీడియోలు చిత్రీకరించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తున్నారు. ఈ ముఠా జముండా అఫీషియల్ పేరుతో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను తెరిచారు. ఈ అకౌంట్ ద్వారా ప్రత్యేకంగా ఓ వర్గానికి చెందిన యువతులు ఎక్కడైనా అబ్బాయిలతో కనిపిస్తే వారిని వీడియోలో చిత్రీకరిస్తున్నారు.  అలా చిత్రీకరించిన వీడియోలను జముండా అకౌంట్‌లో పోస్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ అకౌంట్‌ను  12 వేలమంది ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి తెలుసుకున్న పోలీసులు ప్రస్తుతం దీనిపై మూడు కేసులు నమోదు చేశారు. కానీ పోలీసులకు ఈ జముండా అకౌంటును నిర్వహిస్తున్న వారి గురించి పూర్తి సమాచారం అందలేదు. దీంతో  నిర్వాహకుల పూర్తి వివరాల కోసం హైదరాబాద్ పోలీసులు ఇన్‌స్టాగ్రామ్‌కు లేఖ రాశారు.