NationalNews

సోనాలి ఫోగాట్ మృతి కేసులో కొత్త ట్విస్ట్

బీజేపీ నాయకురాలు,టిక్‌టాక్ స్టార్,హిందీ బిగ్‌బాగ్ షో మాజీ కంటెస్టెంట్ సోనాలీ ఫోగాట్ ఇటీవల హఠాన్మరణం పొందారు. ప్రస్తుతం ఇది కాస్త హత్యగా నిర్ధారణ కావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అయితే ఆమె కుటుంబ సభ్యులు ఈ మృతిపై పలు అనుమానాలు లేవనెత్తిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో వాటికి బలం చేకూరేలా.. ఆమె అనుచరులే ఆమె హత్యకు పాల్పడ్డారనన్న విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో గోవా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో హత్యకు సంబంధించి మరో కొత్త కోణం బయటపడింది.

ఈ మేరకు సోనాలీ సహోద్యోగులు ఆమెకు పానీయంలో డ్రగ్స్ కలిపి ఇచ్చినట్లు తెలిపారు. నార్త్ గోవాలోని ఓ రెస్టారెంట్‌లో జరిగిన పార్టీలో ఆమెకు డ్రగ్స్ కలిపిన పానీయాన్ని బలవంతంగా తాగించామని పేర్కొన్నారు. అయితే ఈ దృశ్యాలన్నీ అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.  

నిందితులు సుధీర్ సగ్వాన్,సుఖ్విందర్ సింగ్ దీనిని విచారణలో అంగీకరించినట్లు ఐజీపీ ఓంవీర్ సింగ్ బిష్ణోయ్ తెలిపారు. డ్రగ్స్ కలిపిన పానీయాన్ని తాగించిన వెంటనే ఆమె స్పృహ కోల్పోయారన్నారు. తరువాత నిందితులు ఇద్దరు ఆమెను రెస్టారెంట్‌లోని వాష్‌రూమ్‌కు తీసుకెళ్లి.. అక్కడే దాదాపు రెండు గంటల పాటు ఉన్నారన్నారు. అయితే ఆ రెండు గంటలు అక్కడ ఏంచేశారనే దానిపై మాత్రం నిందితులు నోరు విప్పలేదని చెప్పారు. పానీయంలో కలిపి ఇచ్చిన డ్రగ్స్ కారణంగానే ఆమె మరణించి ఉంటుదని ఐజీపీ అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆర్ధిక పరమైన అంశాలే ఈ హత్యకు  ప్రధానకారణమై ఉంటాయని వెల్లడించారు.